Nov 08,2023 22:35

ప్రజాశక్తి-ఐ.పోలవరం వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై ప్రతి సోమవారం మండల కేంద్రంలో స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమంలో అర్జీదారులు ఫిర్యాదు చేస్తుంటారు. వారి సమస్యలు పరిష్కారం అవ్వని కారణంగా కలెక్టరేట్‌ల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వటానికి వెళ్ళుతున్నారు. జిల్లా అధికారులను కలుసుకుని వారి సమస్యలను లిఖితపూర్వకంగా విన్నవించుకుంటారు. వాటిని అధికారులు పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు సమస్యను పరిష్కరించాలని తిరిగి మండల శాఖ అధికారులకు తెలియజేస్తారు. ఈ స్పందన కార్యక్రమంలో హంగామా చేయడం తప్ప సమస్యల పరిష్కారంలో అధికారులు ఏ విధమైన చొరవ చూపడం లేదని, తమ సమస్యలు అలాగే ఉంటున్నాయని స్పందనకు వచ్చిన అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అర్జీదారుల ఆవేదన ఇలా ఉంది..

సర్వే నెంబర్‌ ఆన్‌లైన్‌ చేయడం లేదు
జి.వేమవరం పంచాయితీ పరిధిలో పెదకొడప గ్రామానికి ఆనుకుని ఉన్న 2.05 ఎకరాల భూమిని 1976 నుంచి నా తండ్రి, నేను సాగు చేసుకుంటున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తు చెల్లిస్తున్నాము. ఈ భూమికి సంబధించి మాకు అన్ని పత్రాలూ ఉన్నాయి. రెవెన్యూ అధికారుల తప్పిదాలు, వివక్ష వల్ల హైకోర్టులో వాజ్యాలు వేశాము. హైకోర్టు ఉత్తర్వుల ద్వారా సర్వే నెంబర్‌ 242/3,243/3లో గల భూమికి కొత్త ఎఫ్‌-లైన్‌ అప్లికేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసిందిగా హైకోర్టు వారు ఆదేశించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీ ఇచ్చాము. మా భూమికి గల సర్వే నెంబర్లను బ్లాక్‌ లిస్టులో నుంచి తొలగించి రెవెన్యూ రికార్డును ఆన్‌ లైన్‌ చేసి ఖాతా నెంబర్‌ తెలియజేయాలని కోరుతున్నాను.
- కుంచే రాజేంద్ర ప్రసాద్‌,
జి.వేమవరం -పెదకొడప.

డ్వాక్రా సొమ్ములు ఇప్పించాలి
మండలంలోని కేశనకుర్రు పంచాయతీ పెదపేటకు చెందిన మేము 2007లో 10 మంది సభ్యులతో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ మహిళా సంఘం డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసుకొన్నాము. 2015-16లో రూ.50 వేలు, 2019లో రూ.94 వేలు, వైఎస్‌ఆర్‌ ఆసరా రూ.లక్ష మొత్తం సుమారు రూ.2.44 లక్షల నిధులను డ్వాక్రా గ్రూపు ప్రెసిడెంట్‌ యలమంచిలి గౌతమి, సెక్రటరీ కాట్రు వెంకట లక్ష్మి, యానిమేటర్‌ కొంకి పద్మ కలిసి ఫోర్జరీ వేలిముద్రలతో కాజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అధికారులు ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. జగనన్న చెబుదాం కార్యక్రమంలో కూడా ఫిర్యాదు ఇచ్చాము. కాజేసిన మా సొమ్మును ఇప్పించాలని కోరుతున్నాను.
- రేవు పెద ధనలక్ష్మి,
కేశనకుర్రు, పెదపేట.

పశు మాంసం విక్రయాలపై చర్యలేవీ..
జి.వేమవరం పంచాయితీలోని అరుంధతి నగర్‌లో 15 మంది కుటుంబాలు నివాసం ఉంటున్న ప్రదేశంలో పశువులను కోసి దాని మాంసం అమ్ముతున్నారు. ఈ దుర్వాసన భరించలేక పోతున్నామని గతంలో. స్పందనలో, తహశీల్దారుకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కరించ లేదు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఫిర్యాదు ఇచ్చాము. అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చూపాలి.
- ముమ్మిడివరపు సుబ్బారావు,
జి వేమవరం.