ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, మండలాల్లో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమం లో ప్రత్యేక అధికారులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ 205 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి ఎస్ చేతన్, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ భాగ్యరేఖ, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం అర్జీలకు ఎలాంటి పెండింగ్ లేకుండా పరిష్కారం చూపాలన్నారు. సత్వర పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఈనెల 29 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు సెప్టెంబరు 15 లోపు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే నివాసం ఉండాలన్నారు. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదని ఆదేశించారు.










