Feb 20,2023 20:54

- అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిఅర్‌ఒ సత్యనారాయణ, డ్వామా పీడీ మద్దిలేటి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలని పేర్కొన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్‌ అయ్యేటట్లు చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగికీ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసిందని ఉద్యోగులందరూ ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ను డౌన్లోడ్‌ చేసుకొని తప్పకుండా నూరు శాతం ముఖ ఆధారిత హాజరు వేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.