Jan 23,2023 19:44

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి:స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గిరీష అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, డిఆర్‌ఒసత్యనారాయణ, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు స్పందన కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్‌ అయ్యేటట్లు చూడాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, పంచాయతీరాజ్‌ శాఖ, సివిల్‌ సప్లైస్‌, డిపిఒ, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయని అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాయచోటి మండలం రాంనగర్‌కు చెందిన ఎస్‌.జాకీర్‌ హుస్సేన్‌ తనకు వికలాంగుల పింఛన్‌ మంజూరు చేయించాలని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. రైల్వేకోడూరుకు చెందిన పి.హరిప్రసాద్‌ తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.