ప్రజాశక్తి రాయచోటి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన'కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ సత్యనారాయణ, డ్వామా పీడీ మద్దిలేటి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్ అయ్యేటట్లు చూడాలన్నారు. జిల్లాలోని హెచ్వోడీలు స్పందన కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలన్నారు. అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు ఫౌండేషన్ వేసి ఏ ఏ స్టేజీలలో పనులు జరుగుతున్నాయో వాటి వివరాలను తమకు వెంటనే పంపాలన్నారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.










