ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : స్పందన అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని వాటిని త్వరగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ భాగ్యరేఖ పాల్గొన్నారు. మొత్తం 127 అర్జీలను కలెక్టరు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. స్పందనలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, రీ ఓపెనింగ్ కేటగిరీలో మళ్లీ అర్జీలు రాకుండా పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలపై ఆరా తీశారు. వెనకబడిన ప్రాంతాల్లో ఈ నెల ఆఖరులోపు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోరంట్ల, హిందూపురం, నల్లమాడ, సోమందేపల్లి, తనకల్లు మండలాల్లో భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలలో పలు మండలాలు, మునిసిపాలిటీలు వెనకబడి ఉన్నాయని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. అనంతరం పలు సంక్షేమ అభివద్ధి పనులపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.










