Jun 09,2023 21:37

కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

రాయచోటి : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తప్పవని ఫ్యాప్టో జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దశల వారీ పోరాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కతంగానే ఉన్నాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేస్తున్న జిఒఎంఎస్‌ నెంబర్‌ 117ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ఎన్నికలకు ముందు సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాట ఇచ్చి, హామీని నెరవేర్చకపోగా సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం చేపడుతున్న బోదనేతర కార్యక్రమాల వల్ల విద్యా బోధన కుంటుపడు తుందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న తీరు బాధాకరమని, ఉపాధ్యాయుల పట్ల ఆయన వైఖరిని ప్రభుత్వం నియం త్రించాలన్నారు. 11వ పిఆర్‌సి తోపాటు అన్ని రకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చేయాలన్నారు. చట్ట బద్ధమైన 12వ పిఆర్‌సి కమిటీని వెంటనే నియ మించాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు 11వ పిఆర్‌సికి అనుగుణంగా పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని వారు పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు అందరూ ఐక్యమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి, జిల్లా కో-చైర్మన్‌ ఇలియాస్‌, హరిబాబు, శిబా తుర్రహ్మాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు జాబిర్‌, రవీంద్రారెడ్డి, కిఫాయతుల్లా, అమీనుల్లా, సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.