Feb 20,2022 13:25

చండీఘర్‌/లక్నో : పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. యుపిలో మూడవ దశ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 11 గంటలకు యుపిలో 21.18 శాతం పోలింగ్‌ నమోదు కాగా, పంజాబ్‌లో 17.77 శాతం నమోదైంది. కాగా, పంజాబ్‌లో మోగాలోని ఎన్నికల బూత్‌ను సందర్శించకుండా నటుడు సోనూసూద్‌ను ఎన్నికల కమిషన్‌ అడ్డుకుంది. మోగా నియోజకవర్గానికి పంజాబ్‌ అభ్యర్థిగా సోనూసూద్‌ సోదరి మాళవిక పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటర్లను ప్రభావితం చేస్తారన్న శిరోమణి అకాలీదళ్‌ ఫిర్యాదు మేరకు ఆయన వివిధ బూత్‌లకు వెళ్లకుండా ఉండేందుకు ఆయన కారును ఎన్నికల కమిషన్‌ స్వాధీనం చేసుకుంది.
ఇటు యుపిలో సమాజ్‌వాదీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్‌ యాదవ్‌, ఆ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఆయన బాబాయి శివపాల్‌ యాదవ్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అఖిలేష్‌ తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశల్లో తమ పార్టీ హ్యాట్రిక్‌ కొట్టిందని అన్నారు. తర్వాత రెండు దశల్లో కూడా తామే ముందజంలో ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో సిఎం యోగి చేసిందేమీ లేదని విమర్శించారు.