ప్రజాశక్తి - రాయచోటి : వసతిగహాలలో పనిచేసే అధికారులు, సిబ్బంది విద్యార్థినులను సొంత బిడ్డల్లా చూసుకొని వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయతో కలిసి వసతిగహాలలోని బాలికల సంరక్షణపై ఎంఇఒలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మెడికల్ ఆఫీసర్లు, సిడిపిఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 54 బాలికల వసతి గహాలున్నాయన్నారు. వసతి గహాలలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, సిబ్బంది విద్యార్థినులను తమ సొంత బిడ్డల కంటే ఎక్కువ ప్రేమతో చూసుకోవాల్సి బాధ్యత ఎంతైనా ఉందన్నారు. వసతి గహాలల్లో 80 శాతం మంది పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తుంటారన్నారు. వీరికి విద్యా భోధన చేసే ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థినినీ తన కూతురు లాగా భావించి క్రమశిక్షణతో కూడిన మంచి విద్యాబుద్ధులు నేర్పాలన్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, వసతి గహాలలో ఉన్న విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మోనిటరింగ్ కమిటీ సభ్యులను నియమిస్తామని చెప్పారు. ఈ కమిటీలో మెడికల్ ఆఫీసర్, ఎంఇఒ, సిడిపిఓ, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారన్నారు. వీరు నెలకు రెండు సార్లు 2వ, 4వ గురువారాలలో జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గహాలలో ఉండే విద్యార్థినులతో సంప్రదించి వారి సమస్యలు గుర్తించి ఉన్నతాధికాలకు తెలియజేసి పరిష్కరించాలన్నారు. ప్రతి పాఠశాలలోని ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, పాఠశాలలో వసతి గహాలలో ఫిర్యాదు బాక్సులు విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. వసతి గహాలలోని నర్సులు విద్యార్థినిలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. వసతిగహాలలోని విద్యార్థులకు ఎటువంటి చిన్న హాని జరిగినా బాధితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థినులలో భయాన్ని పోగొట్టి ధైర్యంగా తమ సమస్యలు చెప్పే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. వసతి గహాలలో పనిచేసే సిబ్బంది ఎక్కువగా మహిళలే ఉంటారని వీరు విద్యార్థినుల ఆరోగ్య సమస్యలపై దష్టి పెట్టాలన్నారు. సచివాలయంలోని మహిళా పోలీసులు, ఎఎన్‌ఎంలు వసతి గహాలను తరచూ సందర్శించాల్సి ఉంటుందన్నారు. మహిళా పోలీసులు తమ ఫోన్ నెంబర్‌ను విద్యార్థులకు ఇచ్చి వారు ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎఎన్‌ఎంలు ముఖ్యంగా లైంగిక విద్య, రక్తహీనత నివారణ, ఇతర ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థునులకు ఎటువంటి సమస్యలున్న వెంటనే 1098 చైల్డ్ వెల్ఫేర్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యార్థినులు సెలవులలో ఇంటికి వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చినప్పుడు వారి ఆరోగ్య సమస్యలపై నర్సులు ఆరా తీయాలన్నారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి జాకీర్ హుస్సేన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సందప్ప పాల్గొన్నారు.










