ప్రజాశక్తి - హిందూపురం : తనకు పక్షవాతం వచ్చి రెండు సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్నానని తన కుటుంబానికి చెందిన 25 సెంట్ల స్థలాన్ని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రాయించానని బాధితుడు తిమ్మారెడ్డి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర రావుకు తెలిపారు. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ ఆస్తులను పరిరక్షించాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు వినతిని అందించి, పక్షవాత రోగి తిమ్మారెడ్డికి చెందిన ఆస్తి సైతం మున్సిపల్ ఆస్తి అని ఆరోపించారు. ఈ విషయంపై తిమ్మారెడ్డి పక్షవాతంతో బాధపడుతూనే బంధువుల సహకారంతో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావును కలిసి తన సమస్యను వివరించారు. తన సొంత ఆస్తిని అమ్ముకున్నానని, పరిశీలన చేసి న్యాయం చేయాలని కోరారు. సర్వే నంబర్ 422-1లో తన కుటుంబ ఆస్తి 5 ఎకరాలు ఉందన్నారు. ఇందులో గతంలోనే 4 . 75 ఎకరాల భూమిని విక్రయించి, మిగిలిన 25 సెంట్లు భూమిని తన ఆధీనంలోనే ఉంచుకున్నానని చెప్పారు. ఈ 25 సెంట్లు స్థలాన్ని తన వైద్య ఖర్చులతో పాటు తన ఇద్దరి కుమార్తెల వివాహం చేయాలని సంకల్పించి విక్రయించానన్నారు. గతంలో ఈ స్థలాన్ని పంచాయితీకి గాని పురపాలక సంఘానికి గాని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదన్నారు. అయితే కొంతమంది తన స్వాధీనంలో ఉన్న 25 సెంట్లు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పక్షవాతం వచ్చిందని ఎక్కడ రాలేదనితెలుసుకున్న కొంతమంది స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి పక్షవాతంతో బాధపడుతున్న తనకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ ముందు బాధితుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. స్పందించిన మునిసిపల్ కమిషనర్ పరిశీలన చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.










