Sep 26,2023 20:43

మాట్లాడతుఉన్న రైతు సంఘాల నాయకులు

మాట్లాడతుఉన్న రైతు సంఘాల నాయకులు
సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో
అక్టోబరు 3న బ్లాక్‌ డే :ప్రజాశక్తి-నెల్లూరుకెేంద్రం మూడు నల్ల చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నించే సమయంలో రైతులు వ్యతిరేకించి ఆందోళన చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఘటనలో రైతులు మృతి చెందారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్టోబరు 3వ తేదిన బ్లాక్‌ డే పేరుతో కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతాంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, వాటిని అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నించిందని, ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ సుమారు ఏడాది పాటు రైతాంగం ఉద్యమం చేపట్టిన సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్కింపూరి కేరి ప్రాంతంలో రైతులు నిరసన తెలియజేసి వెళ్తున్న సమయంలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కుమారుడు మద్యం సేవించి కారును వేగంగా రైతులపై నడపడంతో ముగ్గురు రైతులు, ఒక మీడియా ప్రతినిధి మృత్యువాత పడ్డారన్నారు. ఈ దుర్ఘటనపై పోలీసు విచారణ నేటి వరకు చేపట్టలేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆ సందర్బాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం మీద బ్లాక్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 రైతు సంఘాలు, 13 కార్మిక సంఘాలు కలిసి సంయుక్త కిసాన్‌ మోర్చా పేరుతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చాయన్నారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి.శ్రీరాములు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకురావడంతోపాటు వ్యవసాయ సవరణ చట్టాన్నిఅమలు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. వీటి వల్ల రైతాంగానికి తీరని నష్టమని 2020 నవంబరు మాసం నుంచి డిల్లీ పొలిమేరలో రైతులు ఆందోళన చేపట్టారన్నారు. ఈ ఆందోళన 2021 అక్టోబరు 31వరకు అంటే ఏడాది కాలం పాటు రైతాంగం ఆందోళనలో సుమారు 850 మంది రైతుసోదరులు మృతి చెందారన్నారు. 70 వేల మంది రైతులు గాయపడగా 80 వేలమంది రైతుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. రైతాంగం తమ మనుగడను కాపాడుకొనేందుకు చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని విడనాడి అక్టోబరు 31న పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పి నల్లచట్టాలను రద్దు చేశారన్నారు. చట్టాన్ని రద్దు చేసే సమయంలో రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చేస్తు చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు.విద్యుత్తు సవరణ చట్టంలో స్మార్టు మీటర్లు భిగించమని హామీలు ఇచ్చినప్పటికీ నేటి వరకు ఆ హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ఈ పోరాట కాలంలో రైతాంగం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వారిపై కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కుమారుడు కారు నడిపారని, ఈ ఘటనలో ముగ్గురు రైతులు మృతిచెందారన్నారు. మీడియా ప్రతినిధి సైతం మృతి చెందగా కేసు నమోదు చేయలేదన్నారు. అక్టోబరు 3వ తేది ఈ దేశానికి చీకటి దినంగా రైతాంగం భావిస్తున్నారన్నారు. రైతు సంఘాలకు సంబంధించిన కొన్ని డిమాండ్లను కలుపుకొని ఈ ఏడాది అక్టోబరు మూడవ తేదిన కార్మిక , వ్యవసాయ, కౌలు రైతు సంఘాల సహకారంతో బ్లాక్‌డే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టాలని కేంద్రంలోని కిసాన్‌మోర్చా పిలుపు నిచ్చిందన్నారు.ఈ పిలుపు మేరకు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట, మండల కార్యాలయాల ముందు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో రైతు సంఘాల సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌, గంగపట్నం రమణయ్య, ఎం.పుల్లయ్య, రాపూరి రాధాకృష్ణ నాయుడు, ఎస్‌కె షాన్‌వాజ్‌, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.