మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్
సంస్కరణల పేరుతో ఛార్జీలు పెంపు దారుణం
నెల్లూరు:కేంద్ర ప్రభుత్వం షరుతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా విద్యుత్తు ఛార్జీలు పెంపుదల చేయడం దారుణమని, తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ చేశాయి.శనివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన డిమాండ్ కేంద్రంలోని మినీ ఫంక్షన్ హాల్ లో వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలతో పెట్రోల్, డీజిల్ నిత్యవసర సరుకుల ధరలుఆకాశాన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందని రీతిలో ధరలు పెరగడంతో,. జీవనం కష్టతరంగా మారిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆగ్రహానికి గురుకాక తప్పదని హెచ్చరించారు. అలాగే స్మార్ట్ మీటర్లను బిగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ అదనపు విద్యుత్ చార్జీల పేరుతో వైసిపీ ప్రభుత్వం ప్రజల నుండి దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెరిగిన విద్యుత్ బిల్లులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్ మాట్లాడుతూ సామాన్యులు విద్యుత్ బిల్లులు కట్టలేక, కిరోసిన్ దీపాల వెలుగుల్లో జీవించాల్సిన పరిస్థితి వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవించడమే కష్టంగా ఉందన్నారు.పెరిగిన ధరల కారణంగా ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మూలం రమేష్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఐ ఎంఎల్ నాయకులు రాంబాబు, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి రామరాజు, సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు షాన్ వాజ్, రూరల్ నాయకులు ఆదినారాయణ, ఐద్వా నాయకురాలు మస్తాన్‌బీ, నాయకులు ఏ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










