- అప్పుల కోసం విద్యుత్ భారాలు
- కేంద్రం షరతులకు తలొగ్గుతున్న రాష్ట్రం - ఆర్‌డిఎస్‌ఎస్‌తో చేటు
విద్యుత్ రంగంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంస్కరణలు రాష్ట్ర ప్రజలపై భారాలకు కారణమవుతున్నాయి. రాష్ట్రాలకు అదనంగా అప్పులు కావాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిం దేనంటూ కేంద్రం పెడుతున్న ఆంక్షలతో ఒకవైపు చార్జీల పెంపు, మరోవైపు ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. కేంద్రప్రభుత్వ విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను మిగిలిన అన్ని రాష్ట్రాలకంటె ముమదుగా ఎపి ప్రభుత్వమే ఉత్సాహంగా అమలు జరపడం గమనార్హం. పేదలకు క్రాస్ సబ్సిడీలు ఇవ్వొద్దంటూ కేంద్రం విధించిన షరతులో భాగంగా ఇటీవల విద్యుత్ టారీఫ్‌లో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేసింది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదార్లపై పెను భారం మోపింది. టిడిపి సర్కారు పాలనలో ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ప్రజలపై భారాలు పడితే ఇప్పుడు అవే విధానాలతో కేంద్ర ప్రభుత్వ షరతుల మూలంగా జనం నెత్తిన కరెంటు చార్జీల పిడుగులు పడుతున్నాయి. ప్రజల ప్రతిఘటన తప్పదు. నూతన టారీఫ్‌తో ఏటా రూ.1400కోట్ల చొప్పున భారాన్ని ప్రజలపై మోపింది. ఇప్పటి వరకు నెలకు 30 యూనిట్లు వినియోగించే వినియోగదారుడు రూ.43.50లు చెల్లిస్తుండగా, కొత్త టారీఫ్ ప్రకారం 31 శాతం భారంతో రూ.57లు చెల్లించాల్సి ఉంటుంది. 75 యూనిట్లు వినియోగిస్తున్న వారు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.137.50ల బిల్లుకు 40శాతం అదనంగా రూ.192లు చెల్లించాలి. నెలకు 0-30 యూనిట్లు వినియోగించే వినియోగదారులు 38,74,147 మందిపై నెలకు 5.23 కోట్లు, 31-75 లోపు 39,84,242 మందిపై నెలవారీగా 20.9 కోట్లు భారం పడింది. 76-125 లోపు 38,28,155 మంది, 126-225 లోపు 27,51,171 మంది, 226-400లోపు 5,98,427 మంది కాగా 400 యూనిట్లు పైబడిన వినియోగదారులు కేవలం 1,34,666 మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలోవున్న సామాన్యులపై చార్జీలు వడ్డించి, కొద్ది మంది ధనికులకు తగ్గించారు. విద్యుత్ చార్జీలకు ట్రూఅప్ చార్జీలు రూ.2900కోట్లు అదనం.
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్‌డిఎస్‌ఎస్) అమలు చేస్తే రుణాలు ఇస్తామని చెబుతూ ప్రజలపై భారాలు మోపాలని, విద్యుత్ సిబ్బందిని కుదించుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ప్రలోభాలకు గురిచేస్తోంది. స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లను అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 2023 డిసెంబర్ నాటికి బిగించాలని ఆర్‌డిఎస్‌ఎస్‌లో ప్రధాన అంశం. ఈ మీటర్లు ఒక్కొక్కటి సుమారు రూ.5 నుంచి 6వేలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మీటర్లకు అయ్యే ఖర్చు విద్యుత్ వినియోగదారులే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లు అమరిస్తే ఫోన్ నెట్‌వర్క్ వినియోగించకముందే బిల్లు ఎలా అయితే చెల్లిస్తున్నామో, విద్యుత్ బిల్లు కూడా అలానే ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు వినియోగం అంతకు మించితే ఇంట్లో ఆటోమేటిక్‌గా కరెంట్ పోతుంది. మరోపక్క వ్యవసాయ పంపుసెట్లకు సర్కారు స్మార్ట్ మీటర్లను బిగిస్తోంది. ప్రస్తుతం రైతులు వాడే కరెంట్‌కు బిల్లు తామే చెల్లిస్తామని చెబుతున్నా, ప్రభుత్వం బిల్లు చెల్లించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇది కూడా గ్యాస్ సబ్సిడీ పథకం లానే అవుతుందని సందేహిస్త్తున్నారు.
- జెన్‌కో, డిస్కంల ప్రైవేటీకరణ
ఎపి జెన్‌కో, డిస్కంలను ప్రైవేటీకరించాలని ఆర్‌డిఎస్‌ఎస్ రూపంలో కేంద్రప్రభుత్వం ఒత్తిడి తేస్తోంది. కృష్ణపట్నం ప్లాంట్‌ను లీజు పేరుతో ప్రైవేట్‌కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) ద్వారా 25 ఏళ్ల పాటు అధిక ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. సెకీ ద్వారా అందిస్తున్న విద్యుత్ పూర్తిగా ఆదానీ కంపెనీదే! రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సరఫరా చేయడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గ్యాస్‌తో నడిచే ప్లాంట్లకు గ్యాస్ లేకపోవడంతో ఆ ప్లాంట్లు మూతపడ్డాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన బొగ్గు, గ్యాస్‌ల గురించి పోరాడాల్సిన రాష్ట్రం షరతులకు తలొగ్గి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసుకోవడం ఏమిటని విద్యుత్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
- ఎం శివాజీ










