ప్రజాశక్తి -పెనుకొండ : సంక్షేమబోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం పెనుకొండ పట్టణంలో టాటా ఏసీ,407 కు సంబంధించిన స్టాండ్ల ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేష్, ట్రాన్స్‌పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడవల్లి బాబా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేసే 407, ఐచర్స్, మినీ లారీ, టటాఏస్ వాహనాలకు సంబందించిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకార్మికుల సంక్షేమం వదిలేసి వారి నుంచి చలానా పేరుతో వేధించడం బాధాకరమన్నారు. పెరిగిన రోజువారీ సరుకుల ధరలు పెరగడంతో కార్మికుల కుటుంబపోషణ భారమైందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రవాణా కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచి, అమలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రవాణా కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ సౌకర్యాలను అమలు చెయ్యటానికి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్ల కుటుంబాలు కనీసం మంచి విద్య, వైద్యానికి కూడా నోచుకోలేకపోతున్నారన్నారు. యాదృచ్ఛికంగా, రోడ్లు సక్రమంగా లేక జరిగే ప్రమాదాల సందర్భంలో వీరిని హత్యానేరం కేసుల కింద అరెస్ట్ చేసి రోజుల తరబడి జైళ్ళలో ఉంచుతున్నారన్నారు. కేరళలో లాగా ట్రాన్స్‌పోర్టుకార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, రైతు సంఘం ఉపాధ్యక్షులు హరి, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యదర్శి ఎంవి.రమణ, ట్రాన్స్‌పోర్టు రంగం నాయకులు వజ్రం నాగప్ప, రెడ్డప్ప, మున్సిపల్ యూనియన్ నాయకులు చిన్న వెంకటేష్, తిప్పన్న, 407 డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ నాయకులు బండి శ్రీనివాసులు, టెంపు సీనా, రఫిక్, ఎర్రచాంద్, ఫక్రుద్దీన్, ఫయాజ్, అంజి, శ్రీధర్, భాస్కర్, జబి, కలిపి మారుతితో పాటు 70 మంది డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.










