Jan 16,2023 22:13

ర్యాలీలో పాల్గొన్న నాయకులు, తదితరులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 60ఏళ్లు నిండిన తర్వాత పింఛను ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల భారీ వాహనడ్రైవర్స్‌, క్లీనర్స్‌ హక్కులసాధన సమితి వ్యవస్థాపకులు దుర్గారావు డిమాండ్‌ చేశారు. తెలుగురాష్ట్రాల భారీ వాహనడ్రైవర్స్‌, క్లీనర్స్‌ హక్కుల సాధన సమితి అధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఎర్రగుంట నుంచి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి గొల్లపల్లి సమీపంలో తోటలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ డ్రైవర్లు పొరపాటుగా యాక్సెడెంట్‌ చేస్తే పరిస్థితిని గమనించకుండా నిందలు వేస్తుంటారని అలాంటి వాటికి అడ్డుకట్ట పడేవిధంగా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు, ఉద్యోగులకు, పరిశ్రమలకు ఇలా ప్రతివ్యవస్థ రవాణాలో డ్రైవర్‌ కీలకమని అలాంటి డ్రైవర్ల సంక్షేమానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్‌ అండ్‌ క్లీనర్స్‌ హక్కుల సాధనసమితి రాష్ట్ర కమిటీ ప్రధానకార్యదర్శి బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మోహన్‌ రావు, చౌదరి, వెంకటరమణ, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రెసిడెంట్‌ వెంకటశివ, వైస్‌ ప్రెసిడెంట్‌ మసూద్‌ అలీ, జిల్లా ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌, ధర్మవరం పట్టణ ప్రెసిడెంట్‌ ముసుగు హరికృష్ణతో పాటు అధికసంఖ్యలో డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.