సంక్షేమ పథకాలు వర్తింపజేయాలిఅంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
కడప అర్బన్ : సమస్యల పరిష్కారం కోసం జులై 10వ తేదీన అంగన్‌వాడీ కోర్కెల దినోత్సవం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో 10, 11వ తేదీల్లో అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహిం చనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. శనివారం జడ్‌పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ పరిరక్షణ కోసం పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు నవరత్నాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్‌ను నిర్వీరం చేసే విధంగా బడ్జెట్లో నిధులు తగ్గించిదని విమర్శించారు. గర్భిణీలకు, బాలింతలకు, పేదలకు 48 ఏళ్లుగా కార్యకర్తలు, ఆయాలు సేవలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదని పేర్కొన్నారు. గౌరవ వేతనంతోనే బతుకుతున్నామని తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అనేక సేవలు చేశామని మోడి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదని చెప్పారు. అంగన్వాడీలకు గ్రాటిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పాలక ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సెక్టార్, ప్రాజెక్టు సమావేశాలకు పోతే ఇవ్వాల్సిన టిఎ,డి ఎ బిల్లులు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సెంటర్ అద్దెలు జీతాలు కూడా సరిగా ఇవరని చెప్పారు. అంగన్వాడీలకు మెడికల్ సెలవులు ఇవ్వడం లేదని, చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అంగన్వాడీ సెంటర్లను కుదించడం మానుకోవాలని చెప్పారు. రాయలసీమ, కడప జిల్లాలో రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నూనె, కందిపప్పు, గుడ్లు నాణ్యత లోపం ఉందని, అవి కూడా సరిగా ఇవ్వరని తెలిపారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ కార్యకర్తలను అవమానపరిచే తీరును ఖండిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీలకు రావాల్సిన బిల్లు, పోపు సామానులు, అద్దెలు, వేతనాలు సకాలంలో ఇప్పించే వాటిపై శ్రద్ధపెట్టాలని హితవు పలికారు. అంగన్వాడిలు చాలా సహనంతో, ఓర్పుతో ఉన్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబ్బుతామని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు నవరత్నాలు, అమ్మఒడి వర్తింప చేయాలని కోరారు. ప్రీ స్కూల్ పిల్లలకు జగనన్న కిట్ అందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులు లక్ష్మీదేవి, సుప్రజ, రమాదేవి, రాజేశ్వరి, నిర్మల, రేఖ పాల్గొన్నారు.










