Jan 06,2023 21:05

రేషన్‌ బండి వద్ద బియ్యాన్ని వేయించుకున్న లబ్ధిదారులు

       కదిరి అర్బన్‌ : ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా అందిచే సరుకులు పేద కుటుంబాలకు ఎంతో ఆసరగా ఉంటాయి. అలాంటి రేషన్‌ వ్యవస్థ రానురాను నీరుగారిపోతోంది. ప్రస్తుతం రేషన్‌ షాపుల్లో కేవలం బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా చెక్కర, గోధమ పిండి, కందిబేడలు ఇస్తారని ప్రజలు భావించారు. గతంలో సక్రాంతి కానుక పేరుతో రేషన్‌ షాపుల ద్వారా పలు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఈ సారి కనీసం చెక్కర కూడా ఇవ్వకుండా బియ్యంతోనే సరిపెడుతున్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండుగ పూట అయినా చెక్కర ఇవ్వకపోవడం ఏమిటంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో పండుగ పూట తినుబండారాలు చేసుకోవడం పేదలకు శక్తికి మించిన పనిగా మారింది. ఇలాంటి సమయంలో నిత్యావసర సరుకులను రేషన్‌ షాపుల ద్వార పంపిణీ చేయకుండా ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్‌కార్డు దారులు అందరికీ ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.