సంక్రాంతి సంబరాల్లో బిఎంఆర్
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో శనివారం రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్‌రావు విచ్చేసి సంబరాలలో పాలుపంచుకున్నారు. భోగి పండుగను పురస్కరించుకొని వేకువజామున ఆయన స్వగృహం వద్ద భోగి మంటలను వేసి అందరిని అలరించారు. అభిమానులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు విచ్చేసి శాలువాలతో ఘనంగా సత్కరించి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగమ్మ, శివాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉట్టిపడే కళ అని పేర్కొన్నారు. ఆడపడుచులు వివిధ రంగుల వస్త్రధారణలతో అందంగా అలంకరించుకుని శోభాయమానంగా పెద్ద పండుగను జరుపుకుంటారని తెలిపారు. రైతులకు విరివిగా పంటలు పండగా కుటుంబ సభ్యులందరూ కలిసి సుఖశాంతులతో జరుపుకునేది మకర సంక్రాంతి అంటూ తెలియబరిచారు. పాడి పరిశ్రమ సమృద్ధిగా ఉండాలని దృక్పథంతో పశువులకు వివిధ రంగులు వేసి కనుమ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు నిర్వహించలేదని తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాల నడుమ గంగిరెద్దులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, డప్పులు, కోలాటం తదితర కళలను ఏర్పాటుచేసి ప్రోత్సాహక బహుమతులు అందించామన్నారు. జిల్లా వాసులు, కావలి నియోజకవర్గం అలాగే తన స్వగ్రామ ప్రజలు సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నేను విద్యను అభ్యసించిన జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి జావిద్ అనే కుర్రవాడు హర్యానాలో జరిగిన నేషనల్ క్రీడల్లో మొదటి బహుమతి సాధించారని అలాగే మెహారాజ్ అనే యువకుడు ఒంగోలులో జరిగిన సౌత్ ఇండియా అథ్లెటిక్స్ క్రీడలు, హర్యానా జాతీయ క్రీడల్లో లాంగ్ జంప్, షాట్ పుట్ నందు 3 మెడల్స్ సాధించడం గర్వకారణమన్నారు. నెల్లూరులోని జెండా వీధికి చెందిన షాకీమ్ బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు పొంది న్యూజిలాండ్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం 3 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమించగా తనవంతు కృషి చేసి 21 మంది ఎంఎల్‌ఎలను విజయ పథంలో ముందుకు తీసుకువెళ్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కావలి మాజీ ఎఎంసి చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, బీద రమేష్ యాదవ్, బీద చైతన్య, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, సర్పంచ్ పాటి రంజిత్‌కుమార్, దర్శిగుంట వెంకయ్య తదితరులున్నారు.










