Feb 01,2023 19:58

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి: భద్రతలేని సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి, ఒపిఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తూ ఈ నెల 3వ తేదీన ధర్మస్థలిలో నిర్వహించే సంకల్ప దీక్షను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్‌ పిలుపునిచ్చారు. బుధవారం యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సంకల్ప దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప దీక్షలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని పాత పెన్షన్‌ విధానం అమలు చేసే వరకు పోరాటంలో ఉండాలని కోరారు. సిపిఎస్‌, జిపిఎస్‌ ఏదైనా ఉద్యోగ దోపిడీ అని ఒపిఎస్‌ అమలే సామాజిక బాధ్యతని చెప్పారు. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తామని ఎటువంటి హామి ఇవ్వనీ రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఒపిఎస్‌ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌ మాట తప్పి సిపిఎస్‌ కంటే కూడా ఘోరమైన జిపిఎస్‌ను అమలుకు పూనుకోవడం అన్యాయమన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి గోపాల్‌ నాయక్‌ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే ఏదైనా సాధించకోగలమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనరు సురేంద్రరెడ్డి రాయచోటి మండల ప్రధాన కార్యదర్శి రాజా రమేష్‌,చిన్న మండెం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రసాద్‌, కిఫాయత్‌, గాలివీడు మండల ప్రధాన కార్యదర్శి అమీనుల్లా పాల్గొన్నారు.