పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలు పుట్టపర్తిలో సంబరంగా జరిగాయి. దేశ, విదేశాలకు చెందిన భక్తులు, పర్యాటకులు వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి విచ్చేశారు. భక్తులతో సాయి కుల్వంత్‌హాల్ కిటకిటలాడింది. ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు సభ్యులు వార్షిక నివేదికను విడుదల చేశారు. సత్యసాయి విద్యార్థులు, భక్తులు ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. పట్టణ పురవీధుల్లో సత్యసాయి సూర్య రథోత్సవం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జయంత్యుత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు బాబా సమాధిని దర్శించుకున్నారు.
బాబా సేవలు వెలకట్టలేనివి : కిషన్‌రెడ్డి
మానవాళికి సత్యసాయిబాబా అందించిన సేవలు వెలకట్టలేనివని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు పుట్టపర్తిలో నిర్వహించిన బాబా 97వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయికుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని భార్యతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం జరిగిన జయంతి వేడుకల కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వాలు చేయలేని పనులను సైతం సత్యసాయి సాయి బాబా ప్రజల కోసం చేశారన్నారు. విద్య, వైద్యం, తాగునీరు అందించిన మహనీయుడన్నారు. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి ద్వారా రోగాలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయంటే అది సత్యసాయి బాబా గొప్పతనం అన్నారు. విలువలతో కూడిన విద్యాను అందించడంలో సత్యసాయి విద్యా సంస్థలు ముందున్నాయన్నారు. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం దాహార్తిని తీర్చిన గొప్ప వ్యక్తి బాబా అన్నారు. బాబా చెప్పిన విధంగా 'అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు' అనే సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు.
ట్రస్టు వార్షిక నివేదిక విడుదల
బాబా జయంత్యుత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రస్టు వార్షిక నివేదికను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. వార్షిక ఆదాయం రూ.200 కోట్లు కాగా వ్యయం 120 కోట్లని నివేదికలో పేర్కొన్నారు. ట్రస్టు కార్యక్రమాలు పారదర్శకంగా ఉంటాయని ప్రతి ఏటా వార్షిక నివేదికను ప్రవేశపెడుతున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, చక్రవర్తి, డాక్టర్ మోహన్, నాగానంద, మాజీ మంత్రులు గీతారెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
భక్తులు, పర్యాటకుల సందడి
పుట్టపర్తి రూరల్ : సత్యసాయిబాబా 97వ జయంతి సందర్భంగా పుట్టపర్తి బాబా భక్తులు, పర్యాటకులతో సందడి నెలకొంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు బుధవారం వేకువజాము నుంచే బాబా సమాధిని దర్శించుకున్నారు. జయంతి సందర్భంగా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో భక్తులకు అన్నదానాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు. బాబా చిత్రపటాలు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ వద్ద, సత్యసాయి భక్తులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది సత్యసాయి భక్తులు, ప్రయాణికులు పాల్గొన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద కార్లు, ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు రోడ్డు సమీపం, గణేష్ కూడలితో పాటు పట్టణంలో పలు ప్రాంతాల్లో బాబా చిత్రపటాల ఊరేగింపు కొనసాగింది. విద్యాగిరి వద్ద ఫుట్‌పాత్ పై ఏర్పాటు చేసిన వివిధ దుకాణాల వద్ద జనం సందడి కన్పించింది. పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసు, ఆర్టీసీ, మునిసిపల్, పుడా అధికారులు అన్ని ఏర్పాట్లనూ చేశారు.










