Dec 02,2022 21:26

పుట్టపర్తి పోలీసు స్టేషన్‌లో ఉన్న మసకవంకపల్లి యువకులు

          పుట్టపర్తి రూరల్‌ : సచివాలయం మార్పునకు సంబంధించిన సమస్య చాలాకాలంగా అపరిష్కృతంగా ఉండడంతో దానిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఇంటి వద్దకెళ్లిన గ్రామస్తులపై ఆయన మద్దతుదారులు ఆక్రోశం వెల్లగక్కారు. సమస్యను పరిష్కరించకపోగా వారిపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం నాడు పుట్టపర్తిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల మేరకు... పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల పరిధిలోని మసకవంకపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువకులు శుక్రవారం నాడు పుట్టపర్తిలోని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నివాసం వద్దకెళ్లారు. తమ గ్రామానికి మంజూరైన సచివాలయాన్ని గోపేపల్లిలో ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లాలంటే 9 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. ఏ చిన్నపనికి వెళ్లాలన్నా రానుపోను 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందన్నారు. దీనిని కురుమాల సచివాలయంకు మారిస్తే తమకు ఇబ్బందులు తొలగుతాయని, లేదా తమ గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డిని కోరారు. ఈ సమస్యను వివరిస్తున్న క్రమంలో గ్రామస్తులు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గీయులు గ్రామానికి చెందిన యువకులపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. అక్కడితో ఆగకుండా యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను తెలిపేందుకు వచ్చిన మసకవంకపల్లి యువకులను పుట్టపర్తి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. వీరిలో కొందరు అయ్యప్పమాలధారులు కూడా ఉన్నారు. సాయంత్రం స్నానం చేసేందుకు కూడా వారిని బయటకు పంపలేదు. ఈ విషయంపై పుట్టపర్తి అర్బన్‌ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ మసకవంకపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని దూషించారని, ఆయన కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు యువకులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
జనసేన, సిపిఐ నిరసన
        యువకులపై దాడి, పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న సిపిఐ, జనసేన నాయకులు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపారు. సిపిఐ జిల్లా నాయకులు అంజి, చలపతి, జనసేన నాయకులు అబ్దుల్‌, ఆది, తిరుపతేంద్ర ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించమని కోరడానికి వచ్చిన యువకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం దుర్మార్గం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని నిలదీశారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న యువకులను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా అడ్డుకుని వారిని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
సాయంత్రం యువకుల విడుదల
          ఎమ్మెల్యే సిబ్బంది ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న 17 మంది యువకులను పోలీసులు సాయంత్రం విడుదల చేశారు. మసకవంకపల్లి సర్పంచి రామ్మోహన్‌ రెడ్డితో పాటు గ్రామస్తులు పుట్టపర్తికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో మాట్లాడారు. యువకులు గ్రామంలో ఎవరికీ తెలియకుండా సమస్యను తెలియజేయడానికి వచ్చారని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని గ్రామనాయకులు తెలియజేశారు. అదే విధంగా సచివాలయ సమస్య తీర్చాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి సచివాలయం కోసం గోపేపల్లికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న కురమాలకు కొద్ది రోజులు మ్యాపింగ్‌ చేపిస్తామని, అనంతరం మసకవంకపల్లి గ్రామంలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణ పనులకు గ్రామంలో త్వరలో భూమిపూజ చేస్తామని తెలియజేశారు. యువకులపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా విడుదల చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.