ప్రజాశక్తి మడకశిర : సజావుగా సాగిపోతున్న ఉపాధ్యాయుల జీవితాల్లో చిచ్చు రేపి ఏ మోహం పెట్టుకుని సానుకూలంగా స్పందించి సహకరించమని అడుగుతున్నారని వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని ఉపాధ్యాయులు నిలదీశారు. బుధవారం మడకశిర పట్టణంలోని యాదవ కళ్యాణమండపంలో జిల్లా సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు విలువలతో కూడిన బోధన అనే అంశంపై రెండు రోజులపాటు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులను కలిసి తనకు ఓట్లు వేసి గెలిపించడంలో సహకరించాలని అభ్యర్థించారు. దీంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సిపిఎస్ రద్దు విధానం అమలు చేయకపోవడంతో పాటు వివిధ యాప్‌లను అమలు చేస్తూ తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఇలాంటి నేపథ్యంలో తాము ఎన్నికలకు ఎలా సహకరిస్తామని ప్రశ్నించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డిని నిలదీశౄరు. దీంతో ఆయన ఉపాధ్యాయులను పక్కకు తీసుకువెళ్లి చర్చించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవి శేఖర రెడ్డి, రంగే గౌడు, వాగేష్, తదితరులు పాల్గొన్నారు.










