Jun 01,2023 21:09

పీలేరు : ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా చీమ కుట్టినట్లయినా లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల సాధనకై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కెఆర్‌.సూర్యనారాయణ, గొంతి ఆస్కారావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. పీలేరు తాలూకాలో తాలూకా అధ్యక్షుడు పురుషోత్తం అధ్యక్షతన గురువారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి హాజరై ఉద్యోగుల్లో మరింత ఉత్తేజపరిచేలా సమస్యల సాధనకై యూనియన్‌ చేపట్టిన కార్యక్రమాల గూర్చి వివరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ ఉద్యోగుల జీతాలకు చట్టబద్ధత చేయా లని, కాంట్రాక్టు ఉద్యోగులను సత్వరం రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పిహెచ్‌ఎంఈయు చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఏ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. యుటిఎఫ్‌ నాయకులు రాధాక ష? మాట్లాడుతూ జి. రాధాకృష్ణ మాట్లాడుతూ 11వ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని ఇది దారుణమని అన్నారు. సిపిఎస్‌ సుధాకర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ ను రద్దు చేసి ఓపిస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపిజిఈఏ జిల్లా కార్యదర్శి గురు ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోవాల్సిన ఉద్యోగస్తులను నేడు రోడ్లపైకి తీసుకురావడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పెన్సనర్ల సంఘం పీలేరు తాలూకా అధ్యక్షులు వగళ్ళ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు అందాల్సిన బెనిఫిట్స్‌ సకాలంలో అందిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన సూచించారు. జిల్లా మహిళా విభాగ కార్యదర్శి కుసుమ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో క్రాంక్ట్రట్‌ అసోసియేషన్‌ విశ్వనాధరెడ్డి, చిత్తూరు తాలుకా శ్రీనివాస మూర్తి, సిరాజుద్దీన్‌, పీలేరు తాలుకా కార్యదర్శి రెడ్డిశేఖర్‌, ట్రెజరర్‌ జయరామయ్య, సభ్యులు విద్యాసాగర్‌, కృష్ణయ్య, మోహన్‌, స్వర్ణలత, హసన్‌ బాషలతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.