ప్రజాశక్తి-రెడ్డిగూడెం: ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, 62 సంవత్సరాల రిటైర్మెంట్ జిఓ వర్తింపజేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల కాలంలో పెరిగిన ధరలతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కోవిడ్ డ్యూటీలు ప్రారంభం నాటి నుండి 24 గంటల డ్యూటీ చేయాల్సి వస్తుందని, ఆశా వర్కర్లకు పని భారం ఎక్కువ అయిందని, టైమింగ్స్ సెలవులు లేక, వర్క్ టెన్షన్ తో అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఆశాలకు సంబంధంలేని టెక్నికల్ వర్క్స్, కోవిడ్ టెస్ట్‌లు చేయించడం, వ్యాక్సిన్ వేయడం, ఎన్‌సిడిసిడి సర్వే ఆన్లైన్ చేయించడం, ఇలాంటి పనులు ఆశలతో చేయిస్తున్నారన్నారు. అనంతరం డాక్టర్ సందేశ్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం సిఐటియు నాయకులు యు.కృష్ణారెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ రెడ్డిగూడెం పిహెచ్‌సి అధ్యక్ష కార్యదర్శులు పిల్లి వరలక్ష్మి, ఎం.కనకరత్నం, వి.శ్రీదేవి, సిహెచ్.భవాని, ఎన్.రవికుమార్, కె.మరియమ్మ, తిరుపతమ్మ, పి.వాణి పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామ మండలం అనాసాగరం పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె.గోపాల్, ఆశ వర్కర్స్ పద్మ, ఫాతిమా, జ్యోతి, స్రవంతి పాల్గొన్నారు. ప్రజాశక్తి-చందర్లపాడు: మండలంలోని చింతలపాడు, చందర్లపాడులో సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్‌కి వినతిపత్రం అందజేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ని ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నరీ లీవ్ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఇ.కమల, సుజాత, మేరి, రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: ఆశా వర్కర్లు డాక్టర్ సుష్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి.రాము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరి, జానకి, ఉమ, మేరమ్మ, విమల, ఆశకుమారి, సుజాత, సైదమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: చౌటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తిరువూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా చేసి డాక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బలగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోగులకు సేవలందిస్తూ మృతిచెందిన ఆశ వర్కర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టెమ్మ, సుశీల, లక్ష్మి, సంధ్య, వరలక్ష్మి, వజ్రమ్మ, నిర్మల, సీత, సోనీ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.










