Jul 05,2022 23:48

ప్రజాశక్తి-చందర్లపాడు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిహెచ్‌సిల వద్ద ఆశ వర్కర్లు మంగళవారం ధర్నాలు నిర్వహించారు. చందర్లపాడులో జరిగిన కార్యక్రమంలో సిఐటియు చందర్లపాడు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, సంబంధంలేని పనులు చేయించరాదని, పనిభారాన్ని తగ్గించాలని, వేతనంతో కూడిన మెటర్నటీ సెలవులు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ కమల, మేరీ, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: నందిగామ అనాసాగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ కార్యదర్శి కె.గోపాల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ కవిత, కుమారి, మణిలక్ష్మి, మంగామని, మౌలాబి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి దారా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్స్‌కు గౌరవ వేతనం ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని, పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శిరీష, సుజాత, లక్ష్మీ, మరియా రాణి, నాగమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-విస్సన్నపేట: మండలంలోని తెల్లదేవరపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి వినతిపత్రం తీసుకునేందుకు నిరాకరించడంతో పిహెచ్‌సి గోడకు సిఐటియు నాయకులు వినతిపత్రాన్ని అతికించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.