అనంతపురం ప్రతినిధి : ఇద్దరు సభ్యులు మినహా తక్కిన అందరూ అధికార పక్షమే ఉన్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యల ప్రస్తావన ఏ మేరకు వస్తుందో చూడాల్సి ఉంది. నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ భవనంలో జరగనుంది. ఈ సమావేశానికి అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి జిల్లా పరిషత్ సభ్యులు, అధికారులు , ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అంతా అధికారబలమేవున్న ఈ సమావేశంలో సమస్యల ప్రస్తావన ఏ మేరకు రానున్నాయన్నది నేడు జరిగే సమావేశంలో చూడాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ సంబంధమైన సమస్యలు అధికంగానున్నాయి. ఎప్పుడూ ఆకాశం వైపు ఎదురు చూసే రైతులు ఈసారి అధికంగా వర్షాలు పడ్డాయి. ఈ అధిక వర్షాలు రైతులను తీవ్ర నష్టాలపాలుజేశాయి. రెండు జిల్లాల పరిధిలో ఈ ఏడాది 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో పది లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. మరో 70 వేల ఎకరాల్లో మిరప సాగైంది. ప్రధాన పంట వేరుశనగ దిగుబడి ఆశించినంత రాలేదు. పత్తి, మిరప పంటలకు తెగుళ్లు, నాసిరకం విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. తెగుళ్ల దెబ్బకు దిగుబడులూ తగ్గాయి. ఇంత భారీ నష్టాన్ని చవిచూసినా రైతుకు ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందుతుందన్నది ఇప్పటి వరకు స్పష్టతలేదు. ఈ సర్వసభ్య సమావేశంలోనైనా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.
ముందుకొచ్చిన ఇళ్ల స్థలాల సమస్య
రెండు జిల్లాల పరిధిలోనూ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ముందుకొచ్చాయి. లక్షకుపైగా ఇళ్లు మంజూరైనా రెండు జల్లాలోనూ కలిపి ఇప్పటికి నిర్మాణం పూర్తయినవి పది శాతంలోపే ఉంటున్నాయి. ఇప్పటికే లేఅవుట్లలో మౌలిక సదుపాయల కల్పన పూర్తవలేదు. ఇక స్థలముండి ఇంటి పట్టాలేని వారికి వెంటనే ఇస్తామని ప్రభుత్వమిచ్చిన హామీనూ ఇంత వరకు అమలు జరగలేదు. ఉరవకొండ, అనంతపురం, కల్లూరు, తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇంటి పట్టాలపై లబ్ధిదారుల్లోనూ ఆందోళన నెలకొంది.
సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే..
గడిచిన మూడేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆయకట్టు రైతులకు అదనంగా పొందుతున్న ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. పూర్తి చేస్తామన్న హంద్రీనీవా వెడల్పు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బిటిపి, పేరూరు ఎత్తిపోతల పథకాలు ఆగిపోయాయి. హెచ్‌ఎల్‌సి ఆధునీకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. కనీసం మరమ్మతకులకు సైతం హెచ్‌ఎల్‌సి నోచుకోవడం లేదు. ఇటువంటి అనేక సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయి.
పింఛన్ల కోతపై కొనసాగుతున్న గుబులు
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో పింఛన్లకు సంబంధించి తీసుకున్న చర్యలు గందరగోళం అయోమయంలోకి నెట్టాయి. కొంత మంది తమ అర్హతను నిరూపించుకోవాలంటే నోటీసులు జారీ చేసింది. రెండు జిల్లాల పరిధిలో సుమారు 20 వేల మందికి ఈ రకంగా నోటీసులు అందాయి. దీనిపై పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో తిరిగి పింఛన్లను యథావిధిగా ఇచ్చారు. అయితే ఈ నెలలో వారు తమ అర్హతను నిరూపించుకోవాలని ఆదేశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. వీటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలపై నేడు జరిగే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఏమేరకు చర్చిస్తారన్న అంశంపై వేచి చూడాల్సి ఉంది. ప్రజలు మాత్రం ఈ సమావేశంలో అయినా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ఓ నిర్ణయం తీసుకుంటున్నారన్న గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.










