Apr 21,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న ఆత్మకూరు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తా..
- మర్రిపాడు, అనంతసాగరం మండలాల రెవెన్యూ సమస్యలపై ఎంఎల్‌ఎ సమీక్ష
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చుక్కల భూముల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే జిఒ నెంబర్‌ 163ను విడుదల చేశారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయంలో మర్రిపాడు, అనంతసాగరం, మండలాల సంబంధించి రెవెన్యూ సమస్యలపై ఆర్‌డిఒ ఎస్‌.కరుణకుమారితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాలలో ఇప్పటివరకు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అనేక రెవెన్యూ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం కోసం మండలాల వారీగా ఆర్‌డిఒలతో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రెవెన్యూ సమస్యలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
మండలాల వారీగా వచ్చిన రెవెన్యూ సంస్థలను మండలస్థాయి అధికారులు ఎంఎల్‌ఎలకు వివరించారు. అనంతరం ఆర్‌డిఒతో కలిసి సమస్యలతో చర్చించిన ఎంఎల్‌ఎ ఎన్ని రోజుల్లోగా వాటిని పరిష్కరిస్తారో ప్రజలకు తెలియజేయాలని అడిగారు. రెవెన్యూ కార్యాలయాలకు చిన్నచిన్న సమస్యలపై వచ్చే ప్రజలకు అప్పటికప్పుడే పరిష్కరిస్తే ఇలా సమీక్షలు నిర్వహించి పరిష్కరించాల్సి అవసరం ఉండదని కోర్టు వివాదాలు పంపిణీ తదితర సమస్యలపై ఉన్నత అధికారులకు తెలిపి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో మొత్తం 17 వేల ఎకరాల చుక్కల భూముల సమస్యలు పరిష్కారం అవుతాయని, అందులో సత్వరమే 15వేల ఎకరాల్లో రైతులకు ఆర్థిక లావాదేవీలు అమ్ముకుని కొనుగోలు వంటివి చేసుకోవచ్చని, మరో రెండు వేల ఎకరాల్లో భూములను సర్వే నిర్వహించి వారికి సైతం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గోపారం వెంకట రమణమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, సిండికేట్‌ ఫార్మర్‌ సొసటీ అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్దార్‌, కొండ వెంకటేశ్వర్లు, ఐవి. రమణారెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, సయ్యద్‌ జమీర్‌, అనంతసాగరం, మర్రిపాడు తహశీల్దార్లు, డిటిలు, నాయకులు పాల్గొన్నారు.