సమస్యల పరిష్కారానికి పోరాడుతా..
ప్రజాశక్తి-సీతారామపురం : ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో పోరాడుతానని పిడిఎఫ్ బలపరిచిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ విద్యా రంగంలో మొదటి నుండి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు చెప్పలేని పరిస్థితి నెలకొందని, ఉన్నతవిద్యకు వెళితే ప్రతిపాఠశాలలో అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా తక్కువ వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం కాలాన్ని నెట్టుకొస్తుందన్నారు. విద్యా రంగంలో సుమారు 30 వేల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచి చూసే పరిస్థితి నెలకొందన్నారు. విద్యారంగలో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసి పాఠశాలల మూతవేతను ఆపాలని, అవుట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీలకు మినిమం టైం స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, జులై 31 కి కొత్త పిఆర్‌సి రావాల్సి ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకు కమిటీని వేయకపోవడం విడ్డూరంగా ఉందని తొందరగా 12వ పిఆర్‌సిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేయాలని ఎన్నికల కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే గిఫ్ట్‌లకు తాయిలాలు ఓటర్లు లొంగకుండా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భోగ్యం శ్రీనివాసులు, గొడ్లవేటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఎడమ తిరుపతయ్య, యుటిఎఫ్ నాయకులు సిహెచ్ ప్రతాప్, సారే సురేష్, వై.లక్ష్మయ్య, సిహెచ్.రవీంద్రారెడ్డి, ఓ.నరసింహారాజు, ఏ.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










