Dec 30,2022 20:25

ఫొటో : మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
- మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్‌ : ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన నిర్వహించారు. 27 అజెండా అంశాలతో కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా కొనసాగింది. తొలుత మున్సిపల్‌ అధికారులు అజెండాలో పొందుపరిచిన అంశాలను సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం కౌన్సిల్‌ సభ్యులు తమ వార్డుల పరిధిలో సమస్యల గురించి కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి విగ్రహాన్ని పట్టణంలోని బిఎస్‌ఆర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయాలని ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అజెండాలో చేర్చడంతో విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెవి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు మున్సిపల్‌ బస్టాండ్‌ నిర్మాణాన్ని మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరున ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ ద్వారా ఆత్మకూరు అభివృద్ధి ఫోరం ద్వారా నిర్మిస్తున్నారని వారికి కౌన్సిల్‌ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సభ్యులందరూ తమ హర్షం వ్యక్తం చేశారు. 3వ వార్డు కౌన్సిలర్‌ గౌస్‌బాషా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పించన్ల తొలగింపు కోసం నోటిసులు జారీ చేస్తున్నారని, అనేకమంది పేదలు ఈ పింఛన్ల మీదే ఆధారపడి జీవిస్తుంటారని తెలిపారు. అధికారులు పింఛన్ల విషయమై తనిఖీలు నిర్వహించి అందరికీ సామాజిక పింఛన్లు అందేలా చూడాలని కోరారు. 20వ వార్డు కౌన్సిలర్‌ సూరా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులో అభివృద్ధి పనులు, తదితర వివరాల కోసం ఇప్పటికే మూడుసార్లు అర్జీలు దాఖలు చేశామని, ఇంకా పారిశుధ్య పనులలో భాగంగా బ్లీచింగ్‌, ఫాగింగ్‌ చేయాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన కొబ్బరినూనె, చెప్పులు ఇతర సామాగ్రిని అందచేయాలని కోరారు. స్పందించిన చైర్‌పర్సన్‌ సమాధానమిస్తూ తన దృష్టికి సమస్యలను తీసుకొస్తే వెంటనే చర్చించి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో అవసరమైన చోట్ల పారిశుధ్య పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి మూడు నెలలకు పట్టణానికి నీటిని సరఫరా చేసే ట్యాంక్‌ను శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికుల విషయంలో పర్మినెంట్‌ ఉద్యోగులకు మాత్రమే అలవెన్సులు, ఇతర సామాగ్రి అందిస్తారని, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కూడా వాటిని అందించేందుకు ప్రయత్నిస్తామని తెలియజేశారు. కౌన్సిల్‌ సమావేశంలో 2వ వార్డు వెంకట్రావుపల్లి వద్ద డంపింగ్‌ యార్డు నిర్మాణం, బోర్‌ వెల్‌ ఏర్పాటుతో పాటు 18, 16, 9, 6, 21, 22, 23, 10, 11, 12, 3, 4, 2, 20, 5, 14, 19 17, 1, వార్డుల పరిధిలో డ్రెయినేజీ, సిమెంటు రోడ్ల నిర్మాణాల కోసం అధికారులు కౌన్సిల్‌ అజెండాలో పొందుపరచగా సభ్యులు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అదే విధంగా జగనన్న లే అవుట్లలో అదనపు పైప్‌ లైన్‌ నిర్మాణం, ఆత్మకూరు-అప్పారావుపాళెం వద్దనున్న పెన్నానది పంపు హౌస్‌ నిర్మాణం చేసేందుకు పనులను ప్రాతిపాదించగా వాటికి ఆమోదం తెలిపారు. మొత్తం మీద కౌన్సిల్‌ సమావేశం సాదాసీదాగా ముగిసింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.