ప్రజాశక్తి-హిందూపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు తీవ్రతరం చేద్దామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహా పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని కల్లూరు సుబ్బారావు ఉద్యానవనంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు తీసుకొచ్చిన పేస్ యాప్‌తోపాటు ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న ఇపిఎఫ్, ఇఎస్‌ఐ 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కార్మికుల సమస్యలు, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, తదితర సమస్యలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలో చొరవ చూపడం లేదన్నారు. ముఖ ఆధారిత హాజరును రద్దు చేయాలని ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశామన్నారు. ఇందులో భాగంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి యూనియన్ పిలుపు ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె.నరసింహమూర్తి, నాయకులు ఆనంద, మంజునాథ్, నాగేంద్ర, నారాయణ, చంద్ర, శోభమ్మ, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు










