- 11న కలెక్టరేట్ వద్ద ఆందోళనను జయప్రదం చేయాలి
- పలు సచివాలయాల సిపిఎం ధర్నాలు
ప్రజాశక్తి-విజయవాడ: ప్రజాసమస్యలు పరిష్కారం కోరుతూ, వచ్చే నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, ధరాభారాలను తగ్గించాలని కృష్ణలంకలోని రాణిగారితోట 17వ డివిజన్ శాంపిల్ బిల్డింగ్, 20వ డివిజన్ రణదివెనగర్ మెటర్నిటీ వైద్యశాల వద్ద ధర్నా నిర్వహించారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్న వాంబేకాలనీ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని, వాంబేకాలనీ 60వ డివిజన్ ఎక్సెల్‌ప్లాంట్ జి+3 అపార్టుమెంట్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్టీల్ బిందెలు ప్రదర్శిస్తూ 61వ డివిజన్ శాంతి నగర్ 256వ సచివాలయం సెంటర్, 1వ డివిజన్ కాలువ కట్ట ప్రాంతంలోని సచివాలయంసెంటర్ తదితర ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా సచివాలయాల్లోని సెక్రటరీలకు నాయకులు వినతిపత్రాలను అందజేశారు. చెత్త పన్ను భారం దగ్గర నుంచి ఆస్తి పన్ను, జగనన్న గృహాల్లో జరుగుతున్న మోసాలు, టిడ్కో గృహాల కేటాయింపులో చోటు చేసుకుంటున్న తీవ్రమైన జాప్యం తదితర విషయాలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇల్లు వస్తుందని ఎంతో ఆశతో పుస్తెలు అమ్మి రూ.20 వేలు చెల్లించి నాలుగేళ్లు అవుతున్నా...నేటికీ ఇల్లు రాలేదు...డబ్బులు తిరిగి ఇవ్వలేదని, చేసిన అప్పుకు వడ్డీ చెల్లించలేక పోతున్నట్లు రాణిగారితోటలోని ముని అప్పలనాయుడు వీధిలోని ఓ మహిళ రాణిగారితోట ధర్నా సందర్భంగా నాయకులకు తెలిపి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయా ప్రాంతాల్లో జరిగిన ధర్నా కార్యక్రమాలనుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్, సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఐక్యం కావాలన్నారు. అమ్మఒడికి రూ.13 వేలు...నాన్న బుడ్డి నుంచి రూ.54 వేలు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు నడుస్తుందని విమర్శించారు. వివిధ సంక్షేమ పథకాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిస్తుంది రూపాయి అయితే... పెరిగిన ధరలు, పన్నుల కారణంగా ప్రజల వద్ద నుంచి పది రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నారు. జగనన్న గృహ నిర్మాణం అంశంలో ప్రతి లబ్దిదారుడు రూ.35 వేలు చెల్లించాలని ఒత్తిడి చేయడం దారుణమన్నారు. ధరాభారంతో కుటుంబాలు గడవక పేద ప్రజలు అల్లాడుతుంటే అప్పు చేసైనా ఇంటి నిర్మాణాలకు డబ్బులు చెల్లించాలంటే పేదలు ఎక్కడ నుంచి తెచ్చి చెల్లించాలని ప్రశ్నించారు. పేద ప్రజల వద్ద నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి నాలుగేళ్లు అయినా టిడ్కో గృహాలను పంపిణీ చేయలేదన్నారు. రాణిగారితోట, రణదివెనగర్ లాంటి ఏరియాల్లో డ్రైనేజి వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యి శానిటేషన్ తీవ్ర ఇబ్బందిగా ఉన్నా... బలవంతంగా చెత్త పన్ను వసూలు చేస్తున్నారని, ఇప్పటికయినా ప్రజలు చెత్త పన్ను చెల్లించవదని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 11న కలెక్టరేట్ వద్ద జరుగే ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం తూర్పు సిటీ కమిటీ సభ్యులు ఎన్.హరినారాయణ, జిల్లాకమిటీ సభ్యులు కె.దుర్గారావు, పి.కృష్ణ, టి.ప్రవీణ్, నాయకులు తమ్మిన చంద్రశేఖర్, వై.కృష్ణ, వరప్రసాద్, మోహన్‌రావు, కోరాడ రమణ, లక్ష్మీనారాయణ, దేవుడమ్మ, ఎస్‌కె పీరు, షేక్ నిజాముద్దీన్, ఎస్‌కె షకీలా, ఎం.శశి, ఎం.రమణ, ఎం.బాబూరావు, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.










