Jul 12,2021 11:08

చాగల్లు, కాకినాడ జీజీహెచ్‌ : ఓ నెలల బిడ్డ... శ్మశానంలో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు... ఆ ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుంది.... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో ఉంచి వెళ్లిపోయారు. పసిబిడ్డ ఏడుపును విన్న కాటికాపరి శివ అట్టపెట్టెలో ఉన్న మగశిశువును గుర్తించి, స్థానికులైన వెంకటేష్‌ దంపతులకు అప్పగించాడు. వారు రాజమహేంద్రవరంలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 నియోనాటల్‌ అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది శాంతకుమార్‌, పైలెట్‌ బుల్లిరాజు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని శిశువుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తూ కాకినాడ ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బరువు సుమారు 750 గ్రాములున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు.