కడప ప్రతినిధి : ఇటీవలి వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలు సమరశంఖం పూరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో కోరుతూ కడప, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ల ఎదట నిరసన ప్రదర్శనలకు దిగడం తెలిసిందే. తమకు 2017 నవంబర్‌లో చేపట్టిన పాదయాత్ర సంద ర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో అంగన్వాడీలకు మెరుగైన వేతనాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తామని హామీలిచ్చి, సెల్పీలు తీయించుకున్న ఘటనను గుర్తు చేయడం ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణాలోని అంగన్వాడీల కంటే మెరుగైన వేతనాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలదీయడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు ఉపాధ్యాయుల రుసరుసలు మరోవైపు అంగన్వాడీల నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వానికి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ఇదేపట్టుదలతో అంగన్వాడీలు ఉద్యమాన్ని కొనసాగిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో సుమారు ఏడు వేల మంది వరకు అంగన్వాడీలు ఉన్నట్లు అంచనా.ఇదేతరహాలో అన్నమయ్య జిల్లాలోనూ ఉన్నారు. దేశంలో పిల్లలు, మహిళల్లో రక్తహీనత, గ్లుకోమా వంటి వ్యాధులకు అంగన్వాడీ వర్కర్లు పౌష్టికాహారాన్ని అందిస్తూ సమాధానంగా నిలిచిన సంగతి తెలిసిందే. దేశంలోనే గుజరాత్ తదితర రాష్ట్రాలు అద్వాన్న రేటులో కునారిల్లుతున్న దశలో రాష్ట్రంలో కొనుగోలు శక్తి ఆధారంగా జిఎస్‌డిపి రేటు మెరుగైన స్థితిలో నిలవడానికి గల కారకుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలతో ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల ప్రచారం మొదలుకుని సర్వేలు, సాధికారితా గుర్తింపు వరకు ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రోగులకు మందులు సరఫరా చేయడంలో విశేష కృషి చేశారు.ఇటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది న్యాయమైన సమ స్యలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల సీజన్ మొదలైన నేపథ్యంలో ఉద్యమకారులు శక్తివంచన లేకుండా సమరశంఖం పూరిస్తేనే సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేనిపక్షంలో మరో సార్వత్రిక ఎన్నికల వరకు నిరీక్షించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. తస్మాత్ జాగ్రత్త అని గుర్తుంచుకోవాలి.










