పూర్వ కాలంలో శివవర్మ అనే రాజుకు దమయంతి అనే భార్య ఉండేది. శివవర్మ మంచి పరిపాలనా దక్షుడు. రాణి తన పుట్టినరోజు సందర్భంగా రాజు దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అదేంటంటే.. రాజు వేటకు వెళ్లేటప్పుడు ఒకరోజు తననూ వెంట తీసుకెళ్లాలని కోరుతుంది.
రాణి కోరిక మేరకు రాజు ఒకరోజు తన భార్యతో కలిసి, సరదాగా అడవికి వేటకు వెళ్తాడు. ఆయనతో పాటు కొంత సైన్యాన్నీ తీసుకెళతాడు. వేగంగా రథం నడపడంలో, జంతువులను వేటాడటంలో ఆయన నేర్పరి. అంతేకాదు విలువిద్యలోనూ మంచి నైపుణ్యం ఉంది. రథం వేగంగా వెళుతున్న సమయంలో అడవిలో ఒక్కసారిగా జంతువుల అరుపులు బిగ్గరగా వినిపించాయి. ఆ అరుపులు విని, రాణి కంగారు పడుతుంది.
రథం ఆపి చూస్తే ఏనుగు, సింహం భీకరంగా పోరాడటాన్ని రాజు గమనిస్తాడు. కానీ సింహం దూకుడుకి ఏనుగు విలవిలలాడుతూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఏనుగుపై జాలి పడిన రాణి ఆ ఏనుగుని రక్షించమని రాజుని అడుగుతుంది. రాణి మాటని మన్నించిన రాజు సింహంతో తలపడతాడు. అంతే సింహం ఏనుగుని వదిలి రాజువైపు దూసుకొస్తుంది. దీనితో ఆందోళనకు గురైన రాణి భయంతో స్పృహ తప్పి, పడిపోతుంది.
ఇదంతా గమనిస్తున్న కొందరు సైనికులు సింహాన్ని వెంబడించి బంధించేస్తారు. సైనికుల దాడికి గురై, గాయాలపాలైన సింహం రాజుతో ఇలా అంటుంది. 'మహారాజా! మీరు ప్రజలకి రాజైతే, నేను ఈ అడవికి రాజుని. సరదాగా మమ్మల్ని వేటాడి మీరు ఆనందం పొందుతారు. మీ భార్య కోరిందని ఏనుగుని నా నుండి కాపాడారు. కానీ ఆకలి అయితేనే నేను వేటాడతాను. సరదా కోసం వేటాడను. మరి ఇప్పుడు నా ఆకలి ఎవరు తీరుస్తారు?' మీరు ఒక జంతువుపై జాలి చూపారు. కానీ మరొక జంతువుని చంపబోతున్నారు. ఇదెక్కడి న్యాయం? సమన్యాయం ఎక్కడుంది మీ రాజ్యంలో?' అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
సింహం మాటలతో రాజు ఆలోచనలోపడ్డాడు. 'ఓ మృగరాజా! నీవు చెప్పింది నిజమే. ఇక నుంచి సరదా కోసం నేను జంతువులని వేటాడను. నా రాజ్యములో అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. నీకు ఎటువంటి హానీ మా సైనికులు తలపెట్టరు' అని మాట ఇస్తాడు. వెంటనే సింహాన్ని వదిలిపెట్టమని సైనికులకు ఆదేశాలిస్తాడు. ఇక నుంచి ఎవరూ రాజ్యంలో సరదా కోసం జంతువులని వేటాడకూడదని చాటింపు వేయిస్తాడు. గాయపడ్డ సింహానికి వైద్యం చేయమని, రాజ వైద్యుడిని పిలిపిస్తాడు రాజు. ఇంతలోనే స్పృహలోకి వచ్చిన రాణి రాజు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. రాజ్యంలో ప్రజలంతా రాజు మాటను శిరసావహించడానికి సిద్ధంగా ఉంటారు.
ఎమ్. హేమంత్
94927 12836