Mar 24,2022 21:51

ప్రజాశక్తి-యంత్రాంగం :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన విస్తృత ప్రచారాలు గురువారమూ కొనసాగాయి. విశాఖ జిల్లా హెచ్‌పిసిఎల్‌ గేటు వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన జరిగిన గేట్‌ మీటింగ్‌లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ మోడీ విధానాలను పోరాటాలతో తిప్పికొట్టాలని కోరారు. మాకవరపాలెంలో జరిగిన పోస్టర్‌ ఆవిష్కరణలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి పాల్గన్నారు. చిత్తూరు జిల్లా గంగవరంలో జరిగిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరుకుమార్‌ మాట్లాడుతూ సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కర్నూలులో సి.క్యాంప్‌ సెంటర్‌ నుంచి బళ్లారి చౌరస్తా వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కొలిమిగుండ్లలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పాల్గన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో ఆటో కార్మికులు, స్కీం వర్కర్ల పాదయాత్ర, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటిలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరులో సమ్మెపై అవగాహనా సదుస్సు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో పలు ప్రయివేట సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. చింతలపూడిలో ప్రచార యాత్ర సాగింది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ప్రచారాలు నిర్వహించారు.