ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు, సామాన్యులకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తూనే ఉంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 28, 29న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు సాగాయి. సన్నాహక సమావేశాలు, బైక్ ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించారు. కరపత్రాలతో ప్రజలకు సమ్మెపై అవగాహన కల్పించారు. అన్ని వర్గాలూ సమ్మెకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సమ్మెకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ఉపాధ్యాయ సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు మద్దతునిచ్చాయి. ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోల బంద్ కూడా చేపట్టానున్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ హర్తాళ్ నిర్వహించనున్నారు. మోడీ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత ఈ సమ్మె ద్వారా వ్యక్తం చేయనున్నారు.
చెత్త పన్నుపై ఆందోళన : రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణకు విధిస్తున్న చెత్త పన్నుపై ఆందోళన సాగింది. సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్‌ను, ఎమ్మెల్యేను అడ్డుకున్నా తమ చేతుల్లో ఏమీ లేదనట్లుగా వారు వెళ్లడంతో గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులను అరెస్ట్ చేసి మళ్లీ విడుదల చేశారు. కౌన్సిల్ సమావేశంలోనూ చెత్త పన్నుపై నిరసన పర్వం సాగింది. టిడిపి కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు.
నిరసనలు : జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేయాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపైనా జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కర్నూలులో సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లకు శవయాత్ర నిర్వహించారు. కావేరీ జాదూ బాధిత రైతులను ఆదుకోవాలని గూడూరు మండలం గుడిపాడులో సచివాలయాలు, ఆర్‌బికెలను బంద్ చేయించి రైతులు ధర్నా చేపట్టారు. పాములపాడులో ఎఒకు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను పరిరక్షించుకోవాలని సేవ్ పబ్లిక్ సెక్టార్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కర్నూలు జిజిహెచ్‌లో స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు మెడికల్ అలవెన్స్ ఇవ్వాలని ఉద్యోగులు నిరసన తెలిపారు.
అవీ..ఇవీ..అన్నీ..
ఉద్యమ మహిళ మల్లు స్వరాజ్యం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సోమన్న సంస్మరణ సభ నిర్వహించారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టిడిపి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు నిరసన తెలిపారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ పేరుతో వ్యాస రచన, వక్తృత్వ, డ్యాన్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.










