Mar 26,2022 21:33

జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం
ప్రజాశక్తి - యంత్రాంగం

         ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త స్వారత్రిక సమ్మెలో కార్మిక, ప్రజాసంఘాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలు పాల్గొని విజయవంతం చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా శనివారం సిఐటియు, వివిధ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేపట్టారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి సమ్మె ఆవస్యకతను వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు.
భీమవరం : సార్వత్రిక సమ్మెకు సిపిఎం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని సిపిఎం డెల్టా డెల్టా కార్యదర్శి బి.బలరాం తెలిపారు. సివిల్‌ సప్లయీస్‌ హమాలీ కార్మికులు జనరల్‌బాడీ సమావేశం ఎస్‌డబ్ల్యూసి గోదాముల వద్ద జరిగింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం గోదాములను ప్రయివేటు వ్యక్తులకు అప్పచెబుతున్నారని వీటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను మార్పు చేస్తూ పని గంటలు పెంచి కార్మికులపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. బడాపారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ప్రకటిస్తూ కార్మికులపై, ప్రజలపై, పేదలపై విపరీతమైనభారాలు పెంచారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నా, వాటిని అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడిదారులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, కార్మికుల సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, సివిల్‌ సప్లయీస్‌ హమాలి కార్మికుల యూనియన్‌ జిల్లా నాయకులు సామంతులు ఉదయభాస్కర్‌, కంకణాల రంగారావు, బి.భాస్కరరావు, శ్రీను వెంకటరావు, మోహన్‌రావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : ఈనెల 28, 29 తేదీల్లో చేపడుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరావు పిలుపునిచ్చారు. సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఒకటో పట్టణంలోని ఎస్‌వి.ఆర్‌ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ తాలూకా కూడలి మీదుగా రెండో పట్టణంలోని పోలీస్‌ ఐ ల్యాండ్‌కు చేరుకుంది. అక్కడ నుంచి పేటపాడులోని డిగ్రీ కాలేజీ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో గొన్నాబత్తుల నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ, యోగి రాజు, తాడికొండ వాసు, మడక రాజు, ధనాల వెంకటరావు, జగ్గూ రాము, శ్రీనివాస్‌, పద్మ, నాగేంద్రబాబు, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.
కొవ్వూరు రూరల్‌: సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పట్టణ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు కమిషనర్‌ టి.రవికుమార్‌కు సమ్మె నోటీసును అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ కార్యదర్శి కె.రాజేంద్ర, యూనియన్‌ పట్టణ గౌరవ అధ్యక్షులు ఎం.సుందర్‌బాబు, నాయకులు పి.వాసు, కె.శ్యామ్‌, మీసాల కళ్యాణ్‌, రాజేష్‌ పాల్గొన్నారు. సమ్మెకు సిపిఐ పూర్తి సంఘీభావం తెలుపుతుందన్నారు. కొవ్వూరు మండలం, పట్టణంలో పూర్తిస్థాయిలో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార జాతా పర్యటించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నేత ఎం.సుందర్‌బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘాల కార్యదర్శి మద్దుకూరి దొరయ్య, మాణిక్‌ రెడ్డి, హరిబాబు, రేఖ, నాగేశ్వరరావు, నాగార్జున, కె.వాసు, ఎం.శ్రీను పాల్గొన్నారు.
చింతలపూడి : సమ్మెను జయప్రదం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రామకృష్ణ, ఎ.రవి వ్యవసాయ కార్మికులను కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు డి.సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
ఏలూరు కల్చరల్‌ : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పిఎఫ్‌ వడ్డీ రేటు 8.5 నుండి 8.1 శాతానికి తగ్గించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
యలమంచిలి : సమ్మెలోప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని బాడవా, కలగంపూడి, కాజా, చించినాడ యలమంచిలి, ఆర్యపేట, మేడపాడు, కట్టుపాలెం, ఇలపకుర్రు, దొడ్డిపట్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీవర్థిని, దేవ సుధాకర్‌, సిఐటియు పాలకొల్లు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాతిరెడ్డి జార్జి, కెవిపిఎస్‌ జిల్లా నాయకుడు కానేటి బాలరాజు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం యాగంటి సీత అధ్యక్షతన మండలంలోని తాడువాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడారు. ఈ సమావేశంలో బత్తుల వెంకన్న, ఆంజనేయులు, రెడ్డి బోయిన సత్యవతి, లక్ష్మీనారాయణ, మంగరాజు, బాల సూరయ్య, పి.సోమాలమ్మ పాల్గొన్నారు.
టి.నరసాపురం : ఉపాధి హామీలో రెండోపూట పని విధానాన్ని రద్దు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం వద్ద సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉపాధి హామీ నిధులు రూ.2లక్షల40 వేల కోట్లు విడుదల చేయాలని, పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి రామకష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి, అనుమోలు మురళీ, దుర్గ పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ కోరారు. ఈ సందర్భంగా తణుకులో ఎఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గార రంగారావు, కురెళ్ల శ్రీనివాస్‌, అజయకుమారి, పిఎల్‌ నరసింహారావు, నీలాపు ఆదినారాయణ, పి.జ్యోతిబాబు, గుబ్బల గోపి, కిరణ్‌, రాజు, కుమార్‌, నిర్మలాదేవి, పుల్లేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు కల్చరల్‌ : సార్వత్రిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్‌ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నట్లు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ పిచ్చుక ఆదిశేషు, జిల్లా కో కన్వీనర్‌ పత్తిపాటి రామకృష్ణ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో చేతి వృత్తిదారులందరూ కార్మికులతో మమేకమై సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.