Mar 22,2022 22:54

ఆటో కార్మిక సంఘాల నాయకులు

- కార్మిక సంఘాల తీర్మానం
ప్రజాశక్తి -కర్నూలు కార్పొరేషన్‌:
కేంద్ర కార్మిక సంఘాలు 28.29 తేదీలలో తలపెట్టిన సమ్మెకు కార్మికులు, ఆటో కార్మికులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మంగళవారం కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఆటోల బంద్‌ నిర్వహిస్తామని ఎఐటియుసి కార్యాలయంలో కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎపి ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ సిఐటియు న్యూ సిటీ నగర ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఎపి ఆటో అండ్‌ ట్రాలీ డైవర్స్‌ యూనియన్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, జిల్లా నాయకులు గణేష్‌ సిఐటియు ఆటో యూనియన్‌ ఓల్డ్‌ సిటీ నగర కార్యదర్శి రవి , ఎఐటియుసి ఆటో యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు రాము, కిట్టు మాట్లాడారు. కేంద్రాన్ని పాలించే బిజెపి పార్టీ ఐదు రాష్ట్రాల ఫలితాల అనంతరం పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచడం మొదలు పెట్టిందన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికులకు ఉరితాడుగా మారిన జిఒ 21 వల్ల ఆటో కార్మికులు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ చలానా పేరుతో పోలీస్‌ వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. పోలీసులు దాడులు ఆపాలని వారు డిమాండ్‌ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆటోలబంద్‌ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఆటోల బంద్‌కు ఆటో కార్మికులు సహకరించాలని కోరారు. 24న బంద్‌ పోస్టర్‌ విడుదల, 26న ఆటో ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. సిఐటియు, ఎఐటియుసి ఆటో యూనియన్‌ నగర నాయకులు ఎస్‌.మాలిక్‌ బాష, ఆటో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.