ప్రజాశక్తి - యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం విస్తృత ప్రచారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చేపట్టిన జాతాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న జంగారెడ్డిగూడెంలో బయలుదేరిన ప్రచారజాతా పెంటపాడుకు చేరింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు, జూపాడుబంగ్లాలో నిర్వహించిన సమావేశాల్లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ బిజెపి విధానాలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. గడియారం ఆస్పతి వద్ద అడ్డా కార్మికుల సమావేశం నిర్వహించారు. మంత్రాలయం ప్రధాన వీధుల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. విశాఖపట్నం జిల్లాలో స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ఈ నెల 28న చేపట్టే విశాఖ బంద్‌ను, 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ పలుచోట్ల ప్రచారాలు నిర్వహించారు. మద్దిలపాలెంలో ముఠా కళాశీల సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నర్సీపట్నం, పాయక రావుపేటలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. భీమిలిలో విఒఎలు, చింతపల్లి, జి.మాడుగులలో అంగన్‌వాడీలు, అరకులోయలో టూరిజం కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా ఎల్.కోట, వేపాడ మండలాల్లో సిఐటియు నాయకులు పాదయాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు, పిడుగురాళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులు, పెదనందిపాడు, రాజుపాలెంలో అంగన్‌వాడీలు, సత్తెనపల్లిలో సివిల్ సప్లయీస్ ముఠా కార్మికులు అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. కారంపూడిలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. రేపల్లె, వినుకొండలో సమ్మె పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, ఆగిరిపల్లి, నందిగామ, జగ్గయ్యపేట రూరల్, వత్సవాయిలో ప్రచారం నిర్వహించారు. వత్సవాయిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, నందిగామలో అంగన్‌వాడీలు సమ్మె నోటీసులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు, ప్రచారాలు, పోస్టర్ ఆవిష్కరణలు జరిగాయి. అనంతపురంలో సదస్సు, నెల్లూరులో ప్రచార జాతా చేపట్టారు.










