Jan 01,2022 13:07

  • తెలుగు ప్రజలకు ప్రజాశక్తి నూతనసంవత్సర శుభాకాంక్షలు

2022 స్వతంత్ర భారతావని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో ఒక అపురూపమైన చారిత్రక సంవత్సరంగా నిలిచిపోతుంది.
బ్రిటిష్‌ వలసపాలన నుంచి విముక్తి సాధించడమే గాక వివిధ ప్రాంతాల, భిన్న భాషల, పలు మతాల ప్రజలందరినీ ఏకం చేసి ''భారతదేశం'' అనే భావనను సాకారం చేసింది మన జాతీయోద్యమం. అనేకమంది మహనీయుల త్యాగాలతో ప్రేరణ పొంది, యోధుల బలిదానాలతో పునీతమై, ప్రజలందరి గుండెల్లో గూడుకట్టిన స్వాతంత్య్ర కాంక్ష ఉద్యమాలుగా రగిలింది. ఆ ఉద్యమజ్వాలలనుండి ఆవిర్భవించింది స్వతంత్ర భారతదేశం.
ప్రజల ఆకాంక్షలను, ఆశలను ప్రతిబింబిస్తూ, జాతీయోద్యమంలో రూపు దిద్దుకున్న ఆశయాలను సాధించడమే లక్ష్యం గా రూపొందింది మన రాజ్యాంగం. సామాన్యపౌరుడి నాడిని పట్టుకున్న గాంధీజీ, స్వావలంబన సాధించే ఆధునికభారతాన్ని ఆవిష్కరించిన నెహ్రూజీ, సమైక్య భారతానికి కండపుష్టి తెచ్చిన పటేల్‌ స్వతంత్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేశారు. సామాన్య ప్రజలకు, దళిత, బడుగు జీవులకు సామాజిక, ఆర్థిక న్యాయాలను సమకూర్చడమే కీలక సారంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ రచన చేశారు. స్వతంత్ర భారతావని తన లక్ష్యసాధనలో ముందుకు సాగడానికి కీలకమైన అశేష శ్రామిక జనావళిని సమీకరించి కీలకపాత్ర పోషించారు కమ్యూనిస్టులు. భగత్‌సింగ్‌. అల్లూరి వంటి విప్లవవీరులు యావత్‌ జాతీయోద్యమానికే 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' నినాదంగా పునరవతరించారు.
మన పెద్దలు పోరాడి సాధించి మనకు ఇచ్చిపోయిన స్వాతంత్య్రానికి ఒక అర్థమూ. పరమార్థమూ ఉన్నాయి. వలసపాలననుండి విముక్తి అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడం కాదు. విదేశీ ఆర్ధిక పెత్తనం నుండి కూడా మనదేశ ఆర్ధిక వ్యవస్థను విముక్తి చేసి స్వావలంబన సాధించాలి. ఆ క్రమంలోనే హరిత విప్లవం వచ్చింది. ఆహార స్వావలంబన సాధించాం. ఇప్పుడు దానిని మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలతో నాశనం చేయడానికి పూనుకుంది . రైతాంగం మళ్ళీ పోరాడి ఆ చట్టాలను రద్దుచేయించడంలో విజయం సాధించారు.మన దేశం వ్యవసాయరంగంలో సాధించిన స్వావలంబనను తద్వారా కాపాడుకున్నారు. ఆర్ధిక స్వావలంబన, సామాజికన్యాయం ముడిపడివున్నాయి. దానికి ఒక రూపమే ప్రభుత్వరంగం. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి కూడా మన దేశాన్ని కొంత కాపాడినది ఆ ప్రభుత్వరంగమే. కాని మోడీ సర్కారు ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తున్నది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లే మోడీ దృష్టిలో ఆరాధ్యులు. వారి ప్రయోజనాలకు ప్రభుత్వ రంగాన్ని బలి చేయడం అంటే దేశ ప్రజానీకాన్ని బలిపశువుల్ని చేయడమే. తాజాగా కరోనా వైఫల్యంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రపంచానికే వ్యాక్సిన్‌ లను ఒకప్పుడు అందించగలిగిన మన ప్రభుత్వరంగాన్ని నిస్తేజం చేసి, చివరికి మనదేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్‌ను సగం మందికి కూడా అందించలేని దౌర్భాగ్య స్థితికి తెచ్చింది బిజెపి ప్రభుత్వం.
వివిధ జాతుల ప్రజలంతా సమైక్యంగా పాల్గొన్న మన జాతీయోద్యమ వారసత్వంగా మనం ఫెడరల్‌ రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్నాం. కాని ఇప్పుడు ఆ ఫెడరల్‌ వ్యవస్థకు, రాష్ట్రల హక్కులకు ఎసరు పెడుతోంది బిజెపి. మన రాష్టం విషయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిన, చేస్తున్న ద్రోహం మనకళ్ళముందే కదలాడుతోంది.
అన్ని మతాల, విశ్వాసాల, సాంప్రదాయాల ప్రజలూ భుజం, భుజం కలిపి ఒక్కటిగా నడవడం మన జాతీయోద్యమ వారసత్వం. అందుకే మనది లౌకిక రాజ్యాంగంగా రూపు దాల్చింది. ఈ సమైక్య భావననే జీర్ణించుకోలేకపోయిన ఆరెస్సెస్‌, మరోపక్క ముస్లిం మతతత్వ శక్తులు పురిటిలోనే స్వతంత్ర భారతాన్ని గొంతునులిమి అంతం చేయాలని చూశారు. దేశాన్ని మతకల్లోలాలలో ముంచెత్తారు. చివరికి జాతిపితనే బలితీసుకున్నారు. ఇన్నాళ్ళ తర్వాత కూడా దేశాన్ని మత మారణ కాండకు బలి చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంది.
స్వాతంత్య్రం ఒక ప్రజాస్వామిక భావన. వ్యక్తికి బాధ్యతలతోబాటు, హక్కులను గ్యారంటీ చేసింది ఆ స్వతంత్ర రాజ్యాంగమే. ఓటు హక్కుతోబాటు, భావ ప్రకటనా స్వేచ్ఛ, విమర్శనా స్వాతంత్య్రం, జీవించే హక్కు, మతస్వేచ్ఛ, సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ మన జాతీయోద్యమ వారసత్వమే. బ్రిటిష్‌ ముష్కరులు సైతం తలపెట్టనంత దుర్మార్గమైన రీతిలో మోడీ ప్రభుత్వం పౌరుల ప్రజాస్వామ్య హక్కులమీద దాడి చేస్తోంది. పైగా విమర్శించడమే దేశద్రోహం అంటోంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి చేపట్టి, ఆ రాజ్యాంగానికే తీరని ద్రోహం చేస్తోంది.
మనువాదపు సంకెళ్ళను తెంచుకుని, మతఛాందసపు బుర్ఖాలను చించివేసి జాతీయోద్యమంలో మహిళలు అపూర్వమైన పాత్ర పోషించారు. ఉద్యమంలో సగం అని నిరూపించుకున్నారు. స్వతంత్ర భారతంలో అన్నింటా మహిళలకు సమానత్వం ఉన్నదని రాజ్యాంగం అంగీకరించింది. కాని ఇప్పుడు మళ్ళీ ఆ మనువాదపు

దాష్టీకాన్నే ''ప్రాచీనత'' ముసుగులో గొప్పగా చిత్రీకరిస్తూ అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటోంది.
ఇలా అన్ని విషయాలలోనూ జాతీయోద్యమ వారసత్వాన్ని నాశనం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తూనే తమదే నిజమైన దేశభక్తి అన్నట్టు ప్రచారం చేసుకుంటోంది. నయవంచనలో అందె వేసిన చేయి !
విభజిత ఆంధ్రప్రదేశ్‌ పట్ల మోడీ ప్రభుత్వం ప్రదర్శించిన వివక్షత, ఆడినమాట తప్పి ప్రత్యేక హోదాతో బాటు అన్ని చట్టపరమైన హామీలనూ తుంగలో తొక్కిన వైనం రాష్ట్ర ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహానికి కారణం అయింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి భంగపాటుకు కారణం ఇదే. కాని మన రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలకు మాత్రం రాష్ట్రానికి బిజెపి హయాంలో జరిగిన, జరుగుతున్న అన్యాయం కనిపిస్తున్నట్టు లేదు. అంతకన్నా తమ రెండు పార్టీల నడుమ వైరమే ప్రధానం అయిపోయింది. ఆ వైరంలో పైచేయి కోసం బిజెపి అనుగ్రహానికే పాకులాడుతున్నాయి. అటు దేశంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని ప్రజల ప్రయోజనాలకోసం నికరంగా నిలబడి పోరాడుతున్నవి వామపక్షాలు మాత్రమే.
ఈ నేపధ్యంలో జాతీయోద్యమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, విశాలాంధ్రలో నిజమైన ప్రజారాజ్యాన్ని నెలకొల్పే కృషి ముందుకు సాగాలి. లౌకిక సమైక్యతను, సామాజిక న్యాయాన్ని, పేదలందరికీ ఆర్థిక న్యాయాన్ని, వెనుకబడిన ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు తక్కిన రాష్ట్రంతో సమానంగా అభివృద్ధిని, మహిళాసాధికారతను సాధించేదిశగా ఆ కృషి కొనసాగించాలి. ఆ క్రమంలో ఈ ఏడాది విశాఖ ఉక్కు పరిరక్షణ, ప్రత్యేక హోదా తదితర విభజన హామీల సాధన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా ఉద్యమించేందుకు సంకల్పించాలి. డిల్లీరైతుల పోరాటం మనకు స్ఫూర్తిదాయకం. ఆ పోరాటంలో ప్రతిబింబించిన జాతీయోద్యమ వారసత్వమే మనకు అనుసరణీయం.

- ఎంవిఎస్‌ శర్మ