రాజంపేట అర్బన్ : విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమని, ఉపయోగం శూన్యమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు తెలియజేశారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్మార్ట్ మీటర్ల వలన వినియోగదారులకు ఒక్క లాభం ప్రభుత్వం చూపిస్తే తాము వంద నష్టాలను చూపిస్తామని తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల ఆలోచన తయారీదారుల లబ్ధి కోసమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ కమిషన్ 19 నుంచి 21వ తేదీ వరకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి వినతులకు అవకాశం కల్పించిందని.. అమలుపరచడం, వినతులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.90 కోట్ల మంది మీటర్లు వినియోగిస్తున్నారని, గృహాలు, పరిశ్రమలు, మోటార్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నారని, దీనివలన రూ.1500 కోట్ల రైతులు, ప్రజల మీద భారం పడుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లను తయారు చేసే కంపెనీల నుంచి రూ.కోట్ల కమీషన్లు దండుకునేందుకే ముఖ్యమంత్రి ఈ మీటర్ల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ప్రజలు, రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సుబ్బనరసయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు వేణుగోపాల్, మైనారిటీ నాయకులు అబూబకర్, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.










