Mar 10,2023 22:09

సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా నాయకురాలు

సోమందేపల్లి : మహిళల హక్కుల కోసం , హింస , దోపిడీ , వివక్షతకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తిగా మహిళలు పోరాటం కొనసాగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గౌతమి కోరారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మండపంల ఐద్వా, సిఐటియు కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్‌ గాయత్రి అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గౌతమి మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు మహిళల పరిస్థితిని ఏమాత్రం మెరుగుపర్చకపోగా మరింత దిగజార్చుతున్నాయని విమర్శించారు. మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాల అమలుపట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాల వలన మహిళల్లో పేదరికం , నిరుద్యోగం పెరిగి ఆకలి చావులు వస్తున్నాయన్నారు. మరోవైపు స్త్రీల అభిప్రాయాలకు, ఆలోచనలకు ఏమాత్రం విలువ లేకుండా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనివీటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఇప్పటికే మహిళలు పోరాడుతున్నారని అన్నారు. వివక్ష , అంటరానితనం , సమానత్వం , హక్కుల సాధన లాంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి శ్రీదేవి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు త్రివేణి, మండల నాయకులు శోభారాణి, గాయత్రి, మహిళలు ముంతాజ్‌, అలివేలమ్మ, షబానా, చంద్రకళ, భారతి, శాంతి, గంగాదేవి పాల్గొన్నారు.