Apr 20,2023 22:23

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు న్యాయమూర్తి శైలజ

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అదనపు జిల్లా జడ్జి శైలజ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కొటిపి రహదారిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు న్యాయమూర్తి శైలజ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా గురువులు, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అందుకు అనుగుణంగా విద్యాభ్యాసం సాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఆ తర్వాత తమకు అవకాశం ఉన్నంత మేరకు సమాజాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. బాల్య వివాహాలు, ఈవ్‌ టీజింగ్‌, హక్కులు, బాధ్యతలు, చట్టాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురుకులం ప్రిన్సిపల్‌ నాగమణి, న్యాయవాదులు కళావతి, నవేరా, లోక్‌ అదాలత్‌ శారద, గురుకుల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.