Feb 22,2022 10:22
  • వర్గ పోరాటమే మార్గం

ప్రజాశక్తి - యంత్రాంగం : పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకదాని తరువాత మరొకటిగా సంక్షోభాలు తలెత్తుతాయనీ, దోపిడీ అంతమై మానవ జాతికి విముక్తి కలగడానికి కమ్యూనిజమే పరిష్కారమని పలువురు వక్తలు అన్నారు. వర్గపోరాటమే మార్గమని పేర్కొన్నారు. కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేసిన ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ బుక్స్‌డే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం విజయవాడలోని మార్క్స్‌, ఏంగెల్స్‌ విగ్రహాల వద్ద కమ్యూనిస్టు ప్రణాళిక 174వ వార్షికోత్సవ సదస్సును ప్రజాశక్తి బుకహేౌస్‌, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ సంయుక్తంగా నిర్వహించాయి. తొలుత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ ప్రపంచంలో, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పెట్టుబడిదారీ విధానాలు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయో 1848లో మార్క్స్‌, ఏంగెల్స్‌ తమ కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ మోడీ బలపడాలని చూస్తున్నా, కార్మిక, కర్షక, వర్గ పోరాటాలతో ప్రతిఘటనలు పెరిగాయన్నారు. ఈ నెల 3న ఉద్యోగ, కార్మిక సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ బాధితుల పోరాట పటిమను నిరూపించిందని తెలిపారు. కమ్యూనిస్టులు వర్గపోరాటాలతో బలపడతారన్నారు. కమ్యూనిస్టు ప్రణాళికను నూతనోత్సాహంతో పార్ట్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రాల్లో పలువురు ముఖ్యమంత్రులు నియంతల్లా పాలిస్తున్నారని, వీళ్ల నియంతృత్వ పోకడలకు కమ్యూనిస్టులే కళ్లెం వేస్తారని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షవర్గంగా వ్యవహరించిన విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ గడ్డం కోటేశ్వరరావు కమ్యూనిస్టు ప్రణాళికలోని నాలుగు అధ్యాయాలను క్లుప్తంగా వివరించారు. కార్మికవర్గ రాజ్యం వస్తేనే దోపిడీ వ్యవస్థ అంతమవుతుందని, సమసమాజం నిర్మితమవుతుందని ప్రజాశక్తి బుకహేౌస్‌ ఎడిటర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు. దీనికోసం కమ్యూనిస్టు ప్రణాళిక, ఇతర ప్రామాణిక గ్రంధాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తామని తెలిపారు. ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ లక్ష్మయ్య కార్యక్రమానికి స్వాగతం పలకగా, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జిఎం మనోహర్‌నాయుడు వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రణాళిక పఠనం, కార్టూన్ల ప్రదర్శన నిర్వహించారు.
    విశాఖలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పేదరికం, అసమానతలకు కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చి, కార్మికవర్గ రాజ్యం ఏర్పడినప్పుడే శ్రామికవర్గానికి మేలు జరుగుతుందన్నారు. సమాజాన్ని మార్చడానికి కృషి చేసే వారికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక దిక్సూచి అని తెలిపారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక గురించి వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను ధ్వంసం చేసి సోషలిజం నిర్మాణానికి శ్రామికవర్గాన్ని వర్గపోరాటం వైపు నడిపించే ప్రణాళికను కార్యకర్తలు అధ్యయనం చేయాలని కోరారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ ఆధ్వర్యంలో విప్లవ సాహిత్య పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని క్విట్‌ ఇండియా స్థూపం వద్ద రెడ్‌ బుక్స్‌ను ఆవిష్కరించారు. తూర్పుగోదావరి, అనంతపురం, విజయనగరం, గుంటూరు, కడప, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలోనూ రెడ్‌ బుక్స్‌ డే నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో స్టడీసర్కిల్‌ నిర్వహించారు.