Jul 31,2022 22:35

ప్రజాశక్తి-వత్సవాయి
అలుపెరుగక తెలుగు బాష అభివృద్ధి కోసం నిరంతరం సేవచేసిన కవితరంగం అజ్మీరు వీరుభద్రయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. సామాజిక అంశాలే ఇతివృత్తంగా, జన జాగృతే లక్ష్యంగా సామాజిక రుగ్మతలను దునుమాడుతూ ఆయన సాగించిన రచనలు, రాసిన కవితలు అటు పండితులను, ఇటు పామరులను విశేషంగా ఆకర్షించాయని గుర్తుచేశారు. సాహితీ ద్రష్ట ,సహజ కవిలు, రసమయి సాహితీ సమితి వ్యవస్థాప కులు, కీర్తిశేషులు అజ్మీరు వీరభద్రయ్య సంస్మరణ సభ వత్సవాయి మండలం మక్కపేటలో రసమయి సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. రసమయి సాహితీ సమితి రాష్ట్ర అధ్యక్షులు, కవి రత్న, ఉపాధ్యాయులు దోసపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వివిధ రంగాలకు చెందిన కవులు, రచయితలు ,రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, గ్రామ ప్రముఖులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేక్‌ అబ్దుల్‌ ఘని,చిరుమామిళ్ల హనుమం తరావు, సరికొండ నరసింహారాజు, బత్తుల బ్రహ్మయ్య, యడవల్లి శ్రీనివాసరావు, అన్నెపాగ సుందర్రావు, వల్లూరి సుబ్బారావు, పరసా శ్రీనివాసరావు,ఎంఇఒ చిట్టిబాబు ,హెచ్‌ఎం రమణ, లాహౌరీ బద్దు నాయక్‌, కుటుంబ సభ్యులు పాల్గొని తెలుగు సాహిత్యానికి అజ్మీరు వీరభద్రయ్య చేసిన కృషిని వివరించారు. అభ్యుదయ వాదిగా, ఉపాధ్యాయ ఉద్యమ నేతగా, కళాకారుడిగా, కవిగా అజ్మీరు వీరభద్రయ్య తెలుగుభాష అభివృద్ధికి ఇతోధికంగా తనవంతుగా కృషిచేశారన్నారు. తెలుగు.. వెలుగు కోసం, బాష అభివృద్ధి కోసం అనేక కవితలు, పుస్తకాలు రాశారని గుర్తుచేశారు. ఎందరో యువ కళాకా రులను ప్రోత్సహిస్తూ ఆయన కవితా వ్యాసాంగంలో, సుదీర్ఘ ప్రస్థానంతో ముందుకు సాగా రన్నారు. అభ్యుదయవాద రచయిత, నటుడు, నాటక కర్తగా, సహజకవిగా అనేక బిరుదులను సైతం పొందారని వివరించారు. సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయటానికిగాను 2008లో రసమయి సాహితీ సమితి అనే సంస్థను స్థాపించి ఎంతోమంది వర్తమాన కవులు, రచయితలను ప్రోత్సహించారని గుర్తుచేశారు. కుమారులు జయప్రకాష్‌, శ్రీనివాసరావు, కుమార్తెలు జయశ్రీ, దుర్గమ్మలు పర్యవేక్షించారు.