రాజంపేట అర్బన్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, మండల అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య నాయుడు ఆరోపించారు. యువగళం పాదయాత్రలో మేడా, జడ్పీ చైర్మన్ ఆకేపాటి నియోజకవర్గానికి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సిద్ధవటంలో కొన్ని వ్యాఖ్యలు చేశారని తెలిపారు. లోకేష్‌పై మేడా వ్యక్తిగత విమర్శలను ఖండిస్తూ మంగళవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జవాద్ తుఫాను సమయంలో వాతావరణ శాఖ వారం రోజులుగా హెచ్చరిస్తున్నా ఇసుక దోపిడీ కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ప్రజలను అప్రమత్తం చేయక అన్నమయ్య డ్యామ్ తెగి జనన నష్టంతో పాటు పశు, ఆస్తి నష్టం సంభవించి నేటికీ రెండేళ్లు కావస్తున్నా మేడా, ఆకేపాటి స్పందించకపోవడం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వైద్య కళాశాల మదనపల్లికి తరలిపోవడానికి మేడా చేతగానితనమే కారణమన్నారు. ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడుతూ కొన్ని వేల ఎకరాల భూకబ్జాలకు పాల్పడి ఆలయానికి ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సరికాదని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మేడా రాజంపేట నియోజకవర్గం కోల్పోయిన జిల్లా కేంద్రాన్ని, మెడికల్ కళాశాలను తీసుకువచ్చి వరద బాధితులకు సత్వర న్యాయం చేసి నిరూపించుకోవాలన్నిరు. సమావేశంలో పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండా శ్రీనివాసులు, మైనారిటీ నాయకులు అబూబకర్ పాల్గొన్నారు.










