Oct 19,2022 22:48

  • సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.బాబూరావు
  •  మద్యానికి వ్యతిరేకంగా నేతల పాదయాత్ర

ప్రజాశక్తి-విజయవాడ: సెంట్రల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే పలు బార్లు, బ్రాందీ షాపులు ఉండగా, అజిత్‌సింగ్‌ నగర్‌లోని ఇందిరా నాయక్‌ నగర్‌, లక్ష్మీ నగర్లలో నూతనంగా బార్లు ప్రారంభించారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజల అభీష్టం మేరకు బార్లు మూసివేయాలని సిపిఎం ఆందోళన ప్రారంభించింది. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ బార్లు తొలగించాలని ప్రచారం చేస్తోంది. అధికారపక్ష ప్రజాప్రతినిధుల తీరును ఎండగడుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఇందిరా నాయక్‌నగర్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు తదితరులు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి, వైసిపి ప్రభుత్వం వారు దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి నేడు దానిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రజా ప్రతినిధులే బార్లు ప్రారంభించి మద్యం వ్యాపారాన్ని సాగించడం శోచనీయమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా నాయక్‌ నగర్‌లో బారు ప్రారంభించారని పేర్కొన్నారు. ఒకపక్క స్కూలు, మరోపక్క నూతనంగా నిర్మించిన ఆస్పత్రి (వైఎస్‌ఆర్‌ క్లినిక్‌) ఉండగా, మధ్యలో బార్‌ ప్రారంభించడం దారుణమన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా, నిబంధనలకు తిలోదకాలిచ్చి స్వప్రయోజనాల కోసం బార్లు ప్రారంభించడం అమానుషమన్నారు. సూర్యలంక బీచ్‌లో ఆరుగురు విద్యార్థులు మతి చెందినా బాధిత కుటుంబాలకు సాయం ఇప్పించడానికి తీరకలేని నేతలు బార్లు ఏర్పాటులో మాత్రం తీరికలేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈపాదయాత్రలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణరావు, నాయకులు సిహెచ్‌.శ్రీనివాస్‌, నిజాముద్దీన్‌, సుందర్రామరాజు, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.