ప్రజాశక్తి-విజయవాడ
కృష్ణలంక గౌతమీనగర్ పోస్టాఫీసులో జరిగిన స్కామ్‌లో నిందితులను తక్షణం అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని సిపిఎం ఆధ్వర్యంలో పోస్టాఫీసు వద్ద బుధవారం ధర్నా జరిగింది. స్కామ్‌లోని నిందులను అరెస్ట్ చేయాలని, బాధిత ఖాతాదారులకు న్యాయం చేయాలని, స్కామ్‌పై సమగ్ర విచారణ నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధిత ఖాతాదారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ మాట్లాడుతూ గౌతమీనగర్ పోస్టాఫీసులో జరిగిన స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.1.5 కోట్ల స్కామ్ జరిగి, నాలుగు రోజుల నుంచి బాధిత ఖాతాదారులు భయాందోళనతో పోస్టాఫీసు చుట్టూ తిరుగుతుంటే కనీసం సమాధానం చెప్పే నాధుడే లేకుండా పోవడం అత్యంత దారుణమన్నారు. ఖాతాదారులు చెల్లించిన వారి డబ్బులు పాస్ పుస్తకాల్లో చెల్లించినట్లు నమోదు అయినా కానీ పోస్టాఫీసులో జమ కాలేదని సంబంధిత ఉద్యోగులు విచిత్రమైన సమాధానం చెప్తుండటం అత్యంత సోచనీయమన్నారు. ఖాతాదారులు ఎంత మంది వారి వారి ఖాతాల్లో డబ్బు జమ చేసుకున్నారని, ఏ రోజుకారోజు సంబంధిత అధికారులు వారి విధిలో భాగంగా పరిశీలించి, ఉన్నతాధి కారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని, కానీ సంబంధిత ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణంగానే ఈ స్కామ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇప్పటికయినా ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలన్నారు. ఒక వైపున ధరల మోత, మరొక వైపున పన్నుల పోటు, ఇంకొక వైపున నిరుద్యోగంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. ఇటువంటి స్కామ్‌ల వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోస్టాఫీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన బద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, శంకర్, శివాజి, విబిరాజు, రూబెన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










