ప్రజాశక్తి-రాయచోటి: టిడిఎస్ రిటర్న్స్‌ను నిర్దేశించిన సమయంలోగా డిడిఒలు, ఉద్యోగులు సరైన పద్ధతిలో దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హల్లో టిడిఎస్, టిసిఎస్ నిబంధనలపై అన్ని శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బెర్సుమెంట్ (డిడిఒ) అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపన్ను రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే సంబంధిత డిడిఒలపై పెనాల్టీ పడుతుందన్నారు. ఉద్యోగులు తమ వేతనాలపై నెల నెలా ఎంత టాక్స్ పడుతుంది దానికనుగుణంగా టాక్స్ చెల్లింపులు చేయాలన్నారు. మూడు నెలలకు ఒకసారి ఈ ఫైలింగ్ చేయాలని సూచించారు. క్వార్టర్ ఫైలింగ్ ఈ నెల 31 చివరి తేదీ అన్నారు. టిడిఎస్ ఈ ఫైలింగ్ బాధ్యతాయుతంగా సరైన ప్రక్రియలో సకాలంలో చేయాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. ఉద్యోగులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను ఫారంలో పొందుపరచిన ఇంటికిరాయా, పిహెచ్ తదితర ధ్రువపత్రాలు సరీగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత డిడిఒలపై ఉందన్నారు. ఉద్యోగులు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఎన్నో తప్పులతో ఫైలింగ్ చేస్తున్నారని, అలా చేయకుండా సరిగ్గా ఫైలింగ్ చేయాలన్నారు. ఇన్ కమ్ టాక్స్‌లోని 192, 194-సి, 194-హెచ్, 194-జె, 194 ఎల్ ఎ సెక్షన్‌లపై అవగాహన కల్పించారు. ఉద్యోగులు ఈ ఫైలింగ్‌ను ఆలస్యంగా ఫైలింగ్ చేయకుండా నిర్ణీత సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలన్నారు. సమావేశంలో ఆదాయపు పన్ను శాఖ అధికారి రాజశేఖర్, ఇన్‌స్పెక్టర్ కృష్ణప్రసాద్, అన్ని శాఖల డిడిఒలు పాల్గొన్నారు.










