తాడేపల్లి : కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ స్ఫూర్తితో సిఎం జగన్ ముందుకు వెళ్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మార్క్స్, గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్ పాలన చేస్తున్నారని తను అనను అని, స్ఫూర్తితో సిఎం జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. సిఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో కింది స్థాయి నుంచి మార్పులు తీసుకుని వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దానిలో భాగంగా రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నామని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ అర్థం అవుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సురక్షా క్యాంపైన్ ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు అవుతోందని ఆయన అన్నారు. టిడిపి చేపట్టిన 'సత్యమేవా జయతే'దీక్షపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీ చేసి జైలుకు వెళ్లారని బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని తెలిపారు. అయితే దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు.










